Begin typing your search above and press return to search.

'అఖండ' టీమ్ ఆ స్థాయిలోనే స్కెచ్ వేసిందే!

By:  Tupaki Desk   |   12 Jan 2022 11:30 AM GMT
అఖండ టీమ్ ఆ స్థాయిలోనే స్కెచ్ వేసిందే!
X
సినిమా తీయడానికి డబ్బు ఉంటే సరిపోతుంది .. కానీ దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లాలంటే మాత్రం అనుభవం కావాలి. ఏ సినిమాకైనా అది థియేటర్లలోకి వచ్చే సమయం చాలా ముఖ్యం. కథాకథనాలు బాగానే ఉన్న చాలా సినిమాలు వేళగాని వేళలో వచ్చి వెల్లకిల్లా పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎంత ఖర్చుపెట్టినా కంటెంట్ ఉన్న సినిమాలే థియేటర్లలో ఓ నాలుగు రోజులు ఉంటాయి. అదే నిర్మాత తెలివైనవాడైతే ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని, మరింత వసూళ్లు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.

ప్రస్తుతం 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అదే పనిలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా క్రితం నెల 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. చాలా కాలం తరువాత థియేటర్ల దగ్గర జాతర వాతావరణాన్ని చూపించింది. అసలు మొదటి నుంచి కూడా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారు. అయితే అప్పటికి సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలుగా 'ఆర్ ఆర్ ఆర్' .. 'భీమ్లా నాయక్' .. 'రాధేశ్యామ్' .. 'సర్కారువారి పాట' పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆలసించినా ఆశాభంగం అన్నట్టుగా 'అఖండ' డిసెంబర్ లోనే థియేటర్లకు వచ్చింది. బిజినెస్ పరంగా ఈ సినిమా అందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు 'అఖండ' వేడి కూడా చల్లబడింది .. ఈ నెల 21న ఈ సినిమా ఓటీటీ ద్వారా పలకరించడం కూడా ఖాయమైపోయింది. అయితే ఇప్పుడు సంక్రాంతి బరిలో 'బంగార్రాజు' సినిమా తప్ప చెప్పుకోదగిన సినిమాలేవీ బరిలో లేకపోవడంతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. 'అఖండ' సంక్రాంతి సంబరాలు పేరుతో ఈవెంట్ ప్లాన్ చేశారు. బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూనే, ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉందనే విషయాన్ని గుర్తుచేస్తున్నార్తు.


ఇది డబుల్ సక్సెస్ మీట్ అనీ .. ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే వాళ్లకి ముందుగా చెప్పలేదని బోయపాటి అన్నారు. ఈ సినిమా డబ్బుతో పాటు ధైర్యాన్ని ఇచ్చిందనీ, అందరి హీరోల అభిమానులను సంతృప్తి పరిచిన అరుదైన ఘనత ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పారు. ఇక ఈవెంట్ లో బాలకృష్ణ సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ అనేది సినిమాలకి అసలు సీజన్ కానే కాదు, అయినా 'అఖండ' విడుదలై అనూహ్యమైన విజయాన్ని సాధించిందని అన్నారు. సంక్రాంతి వరకూ ఈ సినిమా సక్సెస్ జోరును కొనసాగించడం విశేషమనీ, ప్యాన్ వరల్డ్ సినిమా అనిపించుకుందని చెప్పారు.

అయితే ఈ సినిమా మరో వారం రోజుల్లో 50 రోజులు పూర్తిచేసుకోనుండగా .. మరో వారం రోజుల్లో ఓటీటీలో రానుండగా .. ఇప్పుడు సంక్రాంతి పేరుతో మళ్లీ సందడి చేయడానికి ప్రయత్నించడం కాస్త అసందర్భంగానే అనిపిస్తుంది. ఇలా పండగ అడ్వాంటేజ్ ను తీసుకుని, మళ్లీ ఈ సినిమా థియేటర్ల దిశగా జనాలను నడిపించడానికీ .. మరి కొన్ని రోజులు థియేటర్ల నుంచి మరిన్ని వసూళ్లను రాబట్టడానికి మిర్యాల రవీందర్ రెడ్డి వేసిన స్కెచ్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి మరి.