Begin typing your search above and press return to search.

ఇలా వారెంట్ తెచ్చుకోవటం ఇంద్రకరణ్ కే చెల్లు

By:  Tupaki Desk   |   21 Jun 2016 11:08 AM IST
ఇలా వారెంట్ తెచ్చుకోవటం ఇంద్రకరణ్ కే చెల్లు
X
కోర్టు విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందులోకి ప్రముఖులు.. కీలక స్థానాల్లో ఉన్న వారు మరింత అలెర్ట్ గా ఉండాలి. కానీ.. ఆ విషయంలో తరచూ తప్పులు చేయటం కనిపిస్తుంది. సమాచార అంతరమో.. ఏం జరగదన్న భరోసానో.. మరేదైనా కారణమో కానీ.. కోర్టు విషయాల్లో పట్టిపట్టనట్లుగా ఉండి కొత్త తలనొప్పులు తెచ్చుకునే నేతల్ని చాలామందినే చూస్తాం. ఇప్పుడా కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

తాజాగా ఆయనకు నాంపల్లి సీసీఎస్ కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. అలా అని ఇంద్రకరణ్ రెడ్డి ఏదైనా కేసులో సంబంధం ఉందా? అంటే అదీ లేదు. ఫిర్యాదుదారుడిగా ఉండి.. కోర్టుకు హాజరు కాని నేపథ్యంలో ఆయనకు కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. న్యాయం చేయాలంటూ కోర్టులో కేసు వేసిన వ్యక్తే కోర్టు వాయిదాకు హాజరు కాకపోవటంతో న్యాయస్థానం ఆయనకు వారెంట్ ఇష్యూ చేసింది. వాలీబాల్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయి. అధ్యక్షునిగా ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన హరనాథ్ రెడ్డి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు.

దీంతో.. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఇంద్రకరణ్ రెడ్డి ఆయనపై ఫిర్యాదు చేశారు. మంత్రిగారు దాఖలు చేసిన ఫిర్యాదును విచారణకు చేపట్టిన కోర్టు.. ఆయన తన వాదనను వినిపించేందుకు వీలుగా వాంగ్మూలం రికార్డు చేసేందుకు కోర్టుకు హాజరు కావాలని కోరారు. అయితే.. ఇంద్రకరణ్ రెడ్డి కోర్టు కోరినట్లుగా హాజరు కాకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి డ్యానీరూథ్ మంత్రిగారికి బెయిల్ బుల్ వారెంట్ జారీ చేశారు. చర్య తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించి.. మళ్లీ అదే కోర్టు మాట వినకుండా ఆగ్రహానికి గురి కావటం ఇంద్రకరణ్ కే చెల్లుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా ఇంద్రకరణ్ జీ?