Begin typing your search above and press return to search.

బాహుబలీ.. బిజినెస్ భళీ !

By:  Tupaki Desk   |   9 March 2017 10:38 PM IST
బాహుబలీ.. బిజినెస్ భళీ !
X
కలగా ఊహించిన ప్రాజెక్టు కలలకు కూడా అందని సినిమాగా రూపొందితే ఆ అనుభవం ఎలా ఉంటుందో చెప్పే ప్రత్యక్షానుభవం బాహుబలి. తెలుగు సినిమాకు అతిపెద్ద భారమవుతుందో అని ఫీలయిన బాహుబలి... భారతీయ సినిమాకే అతిపెద్ద బహుమానం అయ్యింది. తాజాగా వెలుగు చూసిన ఆశ్చర్యకరమైన సమాచారం ఏంటంటే... బాహుబలి ప్రాజెక్టు మొత్తానికి ఎంత బడ్జెట్ అయితే అనుకున్నారో అది కేవలం సెకండ్ పార్టుపైనే ఖర్చు పెట్టేశారట.

సుమారుగా 250 కోట్లు కేవలం బాహుబలి -2 కు నిర్మాతలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇదే భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద రికార్డు అనుకుంటే... దాని ట్రేడ్ మరో విస్మయం. ఇప్పటికే ఈ సినిమా హక్కులు శాటిలైట్ తో కలిపి ఐదొందల కోట్లకు అమ్ముడుపోయి... నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమా హక్కులు కొన్న వారి అంచనాలు మరింత ఘనంగా ఉన్నాయి. వారి లెక్కల ప్రకారం ఈ సినిమా వెయ్యికోట్లు వసూలు చేస్తుందట. అంటే మొత్తం కాదు, కేవలం పార్ట్ 2 మాత్రమే ఈ రికార్డు సాధిస్తుందంటున్నారు. ఇండియన్ సినిమా కెపాసిటీని ఒక తెలుగు సినిమా తెలియజేయడం అంటే అదెంత గర్వకారణమో కదా!

అన్ని పరీక్షలు అయిపోయాక ఏప్రిల్ 28న విడుదల అవుతున్న ఈ సినిమా వేసవిని దున్నేసే అవకాశముంది. మూడు వేల థియేటర్లకు మించి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక సినిమా గొప్ప విజయం సాధిస్తే... రూపకర్తలకే కాకుండా ప్రేక్షకులకు కూడా అంతే ఆనందం కలిగిస్తుంది. దానికి ఉదాహరణే బాహుబలి. ఇది కళకు-కలకు మధ్య కుదిరిన సఖ్యత.