Begin typing your search above and press return to search.

తమన్నాకి కాలం కలిసిరావడం లేదా?!

By:  Tupaki Desk   |   26 Oct 2021 9:20 AM GMT
తమన్నాకి కాలం కలిసిరావడం లేదా?!
X
జీవితంలో అర్హత ఉన్నా .. అనుభవం ఉన్నా .. అందం ఉన్నా కాలం కలిసిరావాలి. కాలం కలిసిరాకపోతే అవకాశాలు చేజారిపోతాయి .. విజయాలు కనబడకుండాపోతాయి. తాజాగా తమన్నా పరిస్థితి ఇందుకు దగ్గరనే ఉందనిపిస్తోంది. 'మాస్టర్ చెఫ్' కార్యక్రమం నుంచి తమన్నాను తొలగించడం అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే తమన్నా కూడా తన జోరు తగ్గిందనే విషయాన్ని గ్రహించే ఆమె కూడా ఈ షో చేయడానికి అంగీకరించింది. 'బాహుబలి' తరువాత ఒక్కసారిగా తమన్నా గ్రాఫ్ తారాజువ్వలా ఆకాశంలోకి దూసుకెళుతుందని అంతా అనుకున్నారు. కానీ చిచ్చుబుడ్డిలా అక్కడే ఒక వెలుగు వెలిగి కూర్చుంది.

సమయానికి 'ఎఫ్ 2' సినిమా రాకపోతే తన పరిస్థితి ఏమిటనేది తలచుకుంటే తమన్నాకే ఎక్కువ భయం వేయవచ్చు. ఆ సినిమా హిట్ కావడమే కాకుండా ఆమెకు మరికొన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. అదే ఊపును కంటిన్యూ చేయాలని ఆమె అనుకుంటే, కరోనా కాలు అడ్డం పెట్టేసింది. ఈ నేపథ్యంలో తెలుగులో అవకాశాలు చాలావరకూ తగ్గాయి. ఒకటి రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నప్పటికీ అవి ఆమె స్థాయికి తగినవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. ఆ దిశగా అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్ చూపించింది. కానీ ఆ వెబ్ సిరీస్ లు అంతగా ఆదరణ పొందలేదు.

ఇలాంటి సమయంలోనే తమన్నా .. ఒక ప్రముఖ టీవీ ఛానల్ కోసం, 'మాస్టర్ చెఫ్' కార్యక్రమానికి హోస్ట్ గా చేయడానికి అంగీకరించింది. ఇందుకుగాను ఆమె పెద్ద మొత్తంలోనే పారితోషికం అందుకుంది. అయితే ఏమైందో తెలియదుగానీ, ఈ షో నుంచి ఆమెను తొలగించి అనసూయను తీసుకున్నారు. ఒక రకంగా తమన్నాను ఇది హర్ట్ చేసే విషయమే. మంచి పేమెంట్ అనుకుని ఆమె రంగంలోకి దిగితే, ఊహించని ట్విస్ట్ ఎదురుకావడాన్ని తమన్నా జీర్ణించుకోలేకపోతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే 'భోళాశంకర్' సినిమా నుంచి తమన్నాను తొలగించారనే టాక్, ఆమె అభిమానులకు మరో షాక్.

చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను తీసుకున్నారు. గతంలో చిరంజీవి సరసన నాయికగా ఆమె 'సైరా' సినిమాను చేసింది. ఆ తరువాత సినిమాగా ' భోళా శంకర్' గురించి చెప్పుకున్నారు. 'గాడ్ ఫాదర్' తరువాత చిరంజీవి చేయనున్న సినిమా ఇదే. వచ్చే ఏడాదిలో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి తమన్నాను తప్పించారనే టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారంపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇందులో వాస్తవమెంతన్నది తెలియాలి.