Begin typing your search above and press return to search.

'డార్లింగ్స్' మీరిక గుండె నిబ్బరం చేసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   7 Aug 2020 9:00 AM IST
డార్లింగ్స్ మీరిక గుండె నిబ్బరం చేసుకోవాల్సిందే
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గుండె నిబ్బరం చేసుకోవాల్సిన రోజులు వచ్చాయి. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్. అప్పటిలా ఏడాదికో ఒకటో రెండో సినిమాలు చేసే పరిస్థితి లేదు. ఆయన సినిమా బడ్జెట్ ఏది చూసినా ఒకటి రూ. 250 కోట్లు అంటే మరొకటి రూ. 400 కోట్లని అంటున్నారు. ఇంత బడ్జెట్ పెట్టి ఆయనతో అన్నీ పాన్ ఇండియా మూవీలను ప్లాన్ చేస్తుండటంతో అవి ఏ రెండేళ్ల కొకసారో వస్తాయి కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ గుండె నిబ్బరం చేసుకోవాల్సిందేనని అంటున్నారు. 2013 సమ్మర్ లో 'మిర్చి 'మూవీ వచ్చిన తర్వాత ఈ ఏడేళ్ల కాలంలో ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు మూడంటే మూడే. మిర్చి వచ్చిన రెండేళ్లకు 2015లో 'బాహుబలి 'వచ్చింది.

ఆ తర్వాత 2017లో 'బాహుబలి-2' వచ్చింది. ఇక 'సాహో ' ఏకంగా రెండేళ్ల నాలుగు నెలల గ్యాప్ తో 2019లో విడుదల అయ్యింది. ఇలా చూసుకుంటే ప్రభాస్ సినిమాలు రెండేళ్లకు ఒకటి వచ్చినట్లే. ఇక 'రాధే శ్యామ్ ' కూడా విడుదల అయ్యేది వచ్చే ఏడాదే కాబట్టి దానికి కూడా రెండేళ్లు సమయం తీసుకున్నట్లే. ఇక పొతే ప్రభాస్ తర్వాతి సినిమా నాగ్ అశ్విన్ తో . ఆ దర్శకుడు కూడా సినిమాలను బాగా చెక్కేవాడే. పైగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ సినిమా అంటున్నారు.. కాబట్టి దానికి ఓ రెండేళ్లు వేసుకోవాల్సిందే. ఇలా 2013 నుంచి 2023 వరకు ప్రభాస్ ఐదు సినిమాలు చేసినట్లు లెక్క.

ప్రభాస్ సినిమాలపై అప్ డేట్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇవ్వడం లేదంటూ 'సాహో ' సమయంలో ఓ సారి, 'రాధే శ్యామ్ ' టైం లో మరోసారి యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు వ్యతిరేకంగా అభిమానులు ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ వేల కొద్దీ ట్వీట్లు పెట్టారు. ప్రభాస్ ఒప్పుకున్న సినిమాల ప్రకారం పరిస్థితి గతంలో మాదిరే ఉండకతప్పదు కాబట్టి ఇకపై ప్రభాస్ ఫ్యాన్స్ గుండె నిబ్బరం చేసుకోవాల్సిందేనని అంటున్నారు.