Begin typing your search above and press return to search.

బాబాయ్ పవన్ కోసం చరణ్ 'డ్రైవింగ్ లైసెన్స్' తీసుకున్నాడా...?

By:  Tupaki Desk   |   15 May 2020 12:30 PM IST
బాబాయ్ పవన్ కోసం చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడా...?
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో రీమేక్‌ ల హవా కొనసాగుతోంది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కావడంతో రిస్క్ ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. ఈ రీమేక్‌లు ఎక్కువ శాతం హిట్ అవ్వడమే కాకుండా నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఇతర భాషల హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతుంటారు. టాలీవుడ్ లో ఇప్పటికే పలు రీమేక్‌ చిత్రాలు షూటింగ్‌ దశలో ఉండగా మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హిందీలో హిట్టైన ‘పింక్‌’ రిమేక్‌ చిత్రం ‘వకీల్‌ సాబ్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే గత కొన్నిం రోజులుగా పవన్ కళ్యాణ్ మరో మలయాళ చిత్రం రిమేక్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

గతేడాది మలయాళంలో వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్' అనే సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పృథ్వీరాజ్ మరియు సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇప్పుడు 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా రీమేక్ కి రంగం సిద్ధం అవుతుందట. ఈ సినిమా రీమేక్ రైట్స్ ని రామ్ చరణ్ పోటీ పడి మరీ దక్కించుకున్నాడట. ఇప్పటికే మలయాళ 'లూసిఫర్' రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న చరణ్.. ఈ సినిమాని తండ్రి చిరంజీవితో రీమేక్ చేయనున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాని బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించాలని చెర్రీ ట్రై చేస్తున్నాడట. అంతేకాకుండా దీనికి పవన్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ గానే స్పందన వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పవర్ స్టార్ కి తగ్గట్టుగా ఈ స్టోరీని మారుస్తున్నారట.

అయితే మలయాళ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుంది. ఈ క్యారెక్టర్ కి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే మెగా హీరోలు పవన్ కళ్యాణ్ - సాయిధరమ్ తేజ్ లను ఒకే స్క్రీన్ పైన చూసే అవకాశం ఫ్యాన్స్ కి దక్కుతుంది. అయితే తేజ్ తో కుదరకపోతే విక్టరీ వెంకటేష్ తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ - వెంకీ కాంబినేషన్ లో 'గోపాల గోపాల' సినిమా రూపొందిన విషయం తెలిసిందే. త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ కి ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూపించాలని చరణ్ అనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.