Begin typing your search above and press return to search.

'బచ్చన్ పాండే' ట్రైలర్: క్రూరమైన గ్యాంగ్‌ స్టర్‌ బయోపిక్ తీయగలరా?

By:  Tupaki Desk   |   18 Feb 2022 7:39 AM GMT
బచ్చన్ పాండే ట్రైలర్: క్రూరమైన గ్యాంగ్‌ స్టర్‌ బయోపిక్ తీయగలరా?
X
బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. మిగతా హీరోలందరూ ఏడాదికి ఒక‌టో రెండో సినిమాలు చేయడమే గగనమైన ఈ రోజుల్లో.. ఖిలాడీ మాత్రం నాలుగైదు చిత్రాలను లాగించేస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ''బచ్చన్ పాండే''. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతిసనన్ - జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - అర్షద్ వార్సి కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే ''బచ్చన్ పాండే'' సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ - మిగతా స్పెషల్ పోస్టర్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. 2022 మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా లాంచ్ చేసారు. ఇది తమిళ్ లో ఘన విజయం సాధించిన కార్తీక్ సుబ్బరాజ్ 'జిగర్తాండ' (తెలుగులో 'గద్దలకొండ గణేష్' గా రీమేక్ చేయబడింది) చిత్రానికి అధికారిక రీమేక్. ఒరిజినల్‌ తో పోలిస్తే హిందీ వెర్షన్‌ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

బేసిక్ ప్లాట్ ని మాత్రమే తీసుకుని నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఓ లేడీ డైరక్టర్ (కృతి సనన్) క్రూరమైన గ్యాంగ్‌ స్టర్‌ బచ్చన్ పాండే (అక్షయ్ కుమార్) జీవితం ఆధారంగా సినిమా తీయడానికి ఆసక్తి కనబరుస్తుంది. దీని కోసం సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున తన స్నేహితుడు (అర్షద్ వార్సీ) సహాయం తీసుకుంటుంది.

అంతకంటే ముందు అతని గ్యాంగ్ లోని అందరూ రౌడీ షీటర్స్ గురించి తెలుసుకుంటుంది. తర్వాత బచ్చన్ పాండేని ఎలాగోలా ఒప్పించి అతడి బయోపిక్ తీయడానికి అనుమతి తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో కృతి మరియు అర్షద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు బచ్చన్ వంటి గ్యాంగ్ స్టర్ బయోపిక్ తీయాలని అనుకోడానికి కారణమేంటి? ఆ తరువాత ఏం జరిగిందనేది? ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో ఫ్లాష్‌ బ్యాక్‌ లో మరణించిన బచ్చన్ పాండే ప్రేమికురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కనిపించింది.

నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు తమిళ వెర్షన్‌ ల కంటే గ్రాండ్‌ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థం అవుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ - విజువల్స్ మరియు యాక్షన్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. 'బచ్చన్ పాండే' లో అక్షయ్ కుమార్ డామినేషన్ ఉండబోతోందన్నది ట్రైలర్‌ లో స్పష్టంగా కనిపిస్తోంది. అగ్ర హీరో భయంకరమైన లుక్స్ మరియు అతని నటన ఆకట్టుకుంటున్నాయి.

పంకజ్ తివారీ వద్ద అక్షయ్ ఆశీర్వాదం తీసుకునే సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. కృతి మరియు అర్షద్ ల మధ్య ఫన్నీ సీన్స్ కూడా అలరిస్తున్నాయి. మొత్తం మీద ఈ ట్రైలర్ ను సినిమాపై ఆసక్తిని కలిగించేలా కట్ చేసారు. మరి 'బచ్చన్ పాండే' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.