Begin typing your search above and press return to search.

బాహుబలి... తొందరగా రావయ్యా!

By:  Tupaki Desk   |   7 July 2015 12:21 PM IST
బాహుబలి... తొందరగా రావయ్యా!
X
బాక్సాఫీసు ముందుకి మాస్‌ హీరో సినిమా రాక చాలా కాలమైంది. బాలయ్య 'లయన్‌'తో చేసిన సందడే. ఆ తర్వాత స్టార్‌ హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. బాహుబలి వస్తుందన్న భయంతో నిర్మాతలంతా తమ సినిమాల్ని విడుదల చేయడానికి వెనక్కి తగ్గారు. ప్రేక్షకులు కూడా బాహుబలి మానియాతో ఆ సినిమా గురించి మాట్లాడుకొంటున్నారు తప్ప ఇతరత్రా సినిమాల ఊసులే చెప్పుకోవడం లేదు. ఆ క్రేజ్‌ చూసే బాహుబలి విడుదలకు ముందు శుక్రవారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు.

'సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌' అనే చిత్రం మాత్రం కాస్త బాగానే ఉందంటున్నారు. అయితే సరైన ప్రమోషన్‌ లేకపోవడంతో వారం రోజులపాటు కూడా సరైన వసూళ్లు సాధించేలా కనిపించడం లేదు. ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలు, ఇటు ప్రేక్షకులు 'బాహుబలి... రావయ్యా తొందరగా...' అంటూ ఎదురు చూస్తున్నారు. థియేటర్లు నడవడం కష్టమైపోతోంది. హాల్‌ నిండి చాలా కాలమైందని యాజమాన్యాలు అంటున్నారు. బాహుబలి వచ్చాక మాత్రం మళ్లీ థియేటర్లు కళకళలాడిపోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలాకాలంగా సినిమాలకి దూరమైన ప్రేక్షకులు కూడా బాహుబలి కోసం మళ్లీ థియేటర్‌కి వచ్చే అవకాశాలున్నట్టు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త ప్రేక్షకులు సినిమా చూసినప్పుడే బాహుబలిలాంటి భారీ చిత్రాలు గట్టెక్కుతాయనేది పరిశ్రమ పెద్దలు చెబుతున్నమాట.