Begin typing your search above and press return to search.

'బాహుబలి' 4మిలియన్లు కొట్టేస్తుందా?

By:  Tupaki Desk   |   11 July 2015 2:26 PM IST
బాహుబలి 4మిలియన్లు కొట్టేస్తుందా?
X
ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డుల్ని నమోదు చేసింది 'బాహుబలి'. ముఖ్యంగా అమెరికాలో తెలుగు ప్రేక్షకులు బాహుబలి మేనియాతో ఊగిపోతున్నారు. ఎప్పుడూ లేనివిధంగా సినిమా విడుదలైన తొలి రోజే థియేటర్లకు క్యూ కట్టారు. మామూలుగా అక్కడ ఏ సినిమా విడుదలైన ప్రీమియర్‌ షోలకి కాస్త హడావుడి ఉంటుంది. ఆ తర్వాత వీకెండ్స్‌ శని, ఆదివారాల్లోనే సినిమాని చూస్తారు. కానీ బాహుబలి విషయంలో మాత్రం ప్రీమియర్‌ షో మొదలుకొని శుక్రవారం కూడా పిచ్చపిచ్చగా చూసేశారు. దీంతో తొలి రోజే 2 మిలియన్‌ డాలర్ల వసూళ్లను కొల్లగొట్టింది బాహుబలి.

తెలుగు సినిమా వారం రోజుల్లో మిలియన్‌ డాలర్ల వసూళ్లు సొంతం చేసుకొందంటే 'అబ్బబ్బ...' అంటూ నోరెళ్లబెట్టేవాళ్లం. కానీ బాహుబలి మాత్రం తొలి రోజులోనే 2 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవి కనీవినీ ఎరుగనిస్థాయి వసూళ్లని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వారియర్‌ సినిమా కావడంతో ఇంగ్లీషు ప్రేక్షకులు కూడా సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తిని కనబరిచారని అమెరికా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. వీకెండ్స్‌ పూర్తయ్యేలోపు 4 మిలియన్‌ డాలర్లు వసూలు చేయొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇదేగనక నిజమైతే ఇక ఈ రికార్డుని మళ్లీ ఎవరూ తుడిచేసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. మొత్తమ్మీద ప్రభాస్‌ బాహుబలితో తన కెరీర్‌కే ఓ బెంచ్‌మార్క్‌లాంటి సినిమా చేసేశాడు.