Begin typing your search above and press return to search.

ఇంత చేసినా పైరసీ ఆగలేదే..

By:  Tupaki Desk   |   12 July 2015 8:30 AM IST
ఇంత చేసినా పైరసీ ఆగలేదే..
X

పైరసీ.. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమను పట్టి పీడుస్తున్న భూతం. ఒకప్పుడు సీడీల వరకే బెడదుండేది. షాపులపై కన్నేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌ పైరసీ దారుణాతి దారుణంగా విస్తరించి ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీని పీల్చి పిప్పి చేసేస్తోంది. ఈ విషయంలో ఇండస్ట్రీ జనాలు కలిసి కట్టుగా పోరాటం సాగిస్తే.. పైరసీని కొంతవరకు అదుపు చేయొచ్చు. కానీ మొదట్నుంచి ఎవరికి వారే అన్నట్లుంది పరిస్థితి. ఐతే బాహుబలి విషయంలో మాత్రం ఇండస్ట్రీ అంతా కలిసి రావడంతో తెలుగు వెర్షన్‌ వరకు పైరసీని అదుపు చేయగలిగారు. ఇప్పటికైతే ఎక్కడా పైరసీ బయటికి వచ్చినట్లైతే వార్తల్లేవు. తెలుగు ప్రేక్షకులు కూడా 'బాహుబలి' లాంటి సినిమాను వెండితెర మీదే చూడాలన్న విజ్ఞత ప్రదర్శిస్తున్నారు.

ఐతే మిగతా భాషల విషయంలో మాత్రం బాహుబలి నిర్మాతలు ఏమీ చేయలేకపోయారు. ఓవైపు తమిళంలో, మరోవైపు హిందీలో బాహుబలి పైరసీ వెర్షన్స్‌ బయటికి వచ్చేశాయి. తమిళంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. ఆ రోజు రాత్రికే పైరసీ ప్రింట్‌ను ఆన్‌లైన్లో పెట్టేసే కొన్ని వెబ్‌సైట్లున్నాయి. హిందీ పరిశ్రమకు కూడా ఇలాంటి బెడదే ఉంది. ఈ వెబ్‌సైట్ల విషయంలో బాహుబలి టీమ్‌ దృష్టిపెట్టలేదు. తెలుగు వెర్షన్‌ మీద గట్టి నిఘా ఉండటంతో పైరసీ మాఫియా తమిళం, హిందీ వెర్షన్ల మీద కన్నేసింది. తమిళనాట అయితే సీడీలు కూడా బయటికి వచ్చినట్లు చెబుతున్నారు. మరి బాహుబలి తమిళ వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తున్న జ్ఞానవేల్‌ రాజా ఏం చేస్తున్నాడో మరి. హిందీలో కరణ్‌ జోహార్‌ కూడా పైరసీ మీద ఓ కన్నేయాల్సి ఉంది.