Begin typing your search above and press return to search.

బాహుబ‌లి-2 మామూలు భారీత‌నం కాదు

By:  Tupaki Desk   |   3 Aug 2016 3:49 PM GMT
బాహుబ‌లి-2 మామూలు భారీత‌నం కాదు
X
తెలుగు ప్రేక్ష‌కుల్లో మినహాయిస్తే పెద్ద‌గా అంచ‌నాలు లేకుండానే.. బ‌డ్జెట్ విష‌యంలో ఎన్నో ప‌రిమితులుండ‌గానే.. 'బాహుబ‌లిః ది బిగినింగ్’ విష‌యంలో అద్భుతాలు చేసింది జ‌క్క‌న్న బృందం. ఇక తొలి భాగానికి ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చింది.. దానిపై ఏ స్థాయిలో కాసుల వ‌ర్షం కురిసిందో.. రెండో భాగంపై అంచ‌నాలు ఎలా ఉన్నాయో.. బడ్జెట్ విష‌యంలో ఇప్పుడు ఎంత స్వేచ్ఛ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ నేప‌థ్యంలో 'బాహుబ‌లిః ది కంక్లూజ‌న్’ ను మ‌రింత భారీగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నంలో ప‌డింది చిత్ర‌బృందం. తొలి భాగానికి అద్భుత రీతిలో ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేసిన లెజెండ‌రీ ఆర్ట్ డైరెక్ట‌ర్ సాబు శిరిల్.. రెండో భాగం విష‌యంలో మ‌రింత‌గా శ్ర‌మిస్తున్నారు.

'బాహుబలి-2' కోసం ఆయన భారీ సెట్టింగ్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ సెట్టింగ్స్ ప‌నుల కోసం దాదాపు 500 మంది పనిచేస్తుండ‌టం విశేషం. పెయింటర్లు మొదలు కార్పెంటర్లు.. వెల్డర్లు.. భవన నిర్మాణ కార్మికులు.. కళాకారులు.. ఇలా చాలామంది ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. క్లైమాక్స్ కోసం సెట్టింగ్స్ తీర్చిదిద్ది జ‌క్క‌న్న‌కు అప్ప‌గించిన సాబు.. ఆ త‌ర్వాతి షెడ్యూల్ కోసం సెట్లు సిద్ధం చేస్తున్నారు. బాహుబ‌లికి ప‌ని చేసిన అనుభ‌వం గురించి మాట్లాడుతూ.. ‘‘బాహుబలి నా కెరీర్‌ లోనే అతిపెద్ద సినిమా. ఒకేసారి ప‌ది సినిమాల‌కు ప‌ని చేసిన‌ట్లు అనిపిస్తోంది. రెండు భాగాల‌కు ప‌ని చేయ‌డం ద్వారా ప‌దేళ్ల‌కు స‌రిప‌డా జ్నానాన్ని సంపాదించా. చారిత్రక కథ.. యుద్ధనేపథ్యం.. భారీ పాత్రలు. సెట్టింగ్స్‌.. యోధులు.. అడవులు.. జంతువులు.. రాజరిక వైభవం.. ఇలా చాలా విషయాల్లో నాకు స‌వాళ్లు విసిరిన సినిమా ఇది. ఐతే ఈ స‌వాళ్ల‌ను ఆస్వాదిస్తున్నా’’ అని సాబుసిరిల్ అన్నారు.