Begin typing your search above and press return to search.

షారుఖ్ సినిమాలో బాహుబలి హంగామా

By:  Tupaki Desk   |   6 Jan 2017 7:30 PM GMT
షారుఖ్ సినిమాలో బాహుబలి హంగామా
X
‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలకు ముందు ఆ సినిమాపై మన దగ్గర ఉన్నంత హైప్ వేరే భాషల్లో లేదు. కానీ సినిమా రిలీజయ్యాక సీన్ మారిపోయింది. మనకంటే మిన్నగా ‘బాహుబలి’ని ఓన్ చేసుకున్నారు పరభాషా ప్రేక్షకులు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ కేవలం తెలుగు సినిమా ఎంత మాత్రం కాదు. హిందీ వెర్షన్ మీద కూడా మన దగ్గర ఉన్నంత హైపే ఉంది. ఆ సినిమా కోసం వాళ్లు కూడా మనలాగే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’కి సంబంధించి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా దాని మీద చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అందుకే హిందీ ప్రమోషన్ కూడా గట్టిగానే ఉండేలా చూసుకుంటోంది బాహుబలి బృందం.

తొలి పార్ట్ విషయంలో టీజర్ లాంటిదేమీ లేకుండా నేరుగా ట్రైలర్‌ ను లాంచ్ చేశారు. ముందు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఎంపిక చేసి ట్రైలర్ని ప్రదర్శించి తర్వాత కొంచెం ఆలస్యంగా హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో మాత్రం ప్లాన్ మారింది. దీనికి టీజర్ రెడీ చేస్తున్నారు. దాన్ని ఈ నెల చివరి వారంలో రిలీజ్ చేయబోతున్నారు. గణతంత్ర దినోత్సవ కానుకగా భారీ అంచనాల మధ్య ఈ నెల 25న రిలీజవుతున్న షారుఖ్ సినిమా ‘రాయిస్’ థియేటర్లలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ టీజర్‌ ను ప్రదర్శించే ఆలోచనలో ఉంది ‘బాహుబలి’ టీం. షారుఖ్ సినిమా అంటే దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతుంది. హైప్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి ‘రాయీస్’తో పాటుగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ టీజర్ వస్తే థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/