Begin typing your search above and press return to search.

బాహుబలి షూటింగ్ లో ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   25 Dec 2015 1:00 AM IST
బాహుబలి షూటింగ్ లో ఏం జరుగుతోంది?
X
2016లో ‘బాహుబలి.. ది కంక్లూజన్’ రావడం దాదాపుగా అసాధ్యమని తేలిపోయింది. ముందుగా అనుకున్నట్లు సెప్టెంబరులో షూటింగ్ మొదలై ఉంటే ఆ ఆశలేమైనా పెట్టుకునే వాళ్లమేమో కానీ.. సంవత్సరం ఆఖరుకు కానీ సినిమా సెట్స్ మీదికి వెళ్లని నేపథ్యంలో 2016లో కూడా ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నకు సమాధానం లభించడం కష్టమనే అర్థమవుతోంది. 2016 మీద ఆశలు వదిలేద్దాం అనుకున్నా.. కనీసం 2017 ప్రథమార్ధంలో అయినా సినిమా థియేటర్లలోకి వస్తుందా అన్నదే ఇప్పుడిక తేలాల్సి ఉంది. రాజమౌళి తీరు చూస్తుంటే మాత్రం ఆ విషయంలోనూ ఆశలు పెట్టుకోవడం కష్టమే అనిపిస్తోంది.

పది రోజుల కిందటే రామోజీ ఫిలిం సిటీలో ‘బాహుబలి-2’ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఐతే అక్కడ ఎవరితో షూటింగ్ చేస్తున్నారన్నదే డౌటు. ఎందుకంటే ప్రధాన పాత్రధారి ప్రభాస్ ఎంచక్కా ఆడియో ఫంక్షన్లకు హాజరవుతూ.. ఇంకేవో కార్యక్రమాల్లో పాల్గొంటూ సరదాగా గడిపేస్తున్నాడు. ఇక విలన్ క్యారెక్టర్ చేయాల్సిన రానా దగ్గుబాటి తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ, ప్రైవేటు కార్యక్రమాల్లో హడావుడి చేస్తూ ఉన్నాడు. రెండో పార్ట్ లో హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన అనుష్క బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. ఈ ముగ్గురి తీరు చూస్తుంటే ఇంకో నెలా రెండు నెలలకు కానీ బాహుబలి-2 షూటింగులోకి వెళ్లేలా కనిపించడం లేదు. మరి ఈ ముగ్గురూ లేకుండా జక్కన్న అండ్ కో షూటింగ్ మొదలెట్టి ఏం తీస్తున్నారన్నదే డౌటు. బహుశా జక్కన్న ఇంకా కెమెరాకు పని చెప్పి ఉండడని.. లొకేషన్ల ఎంపిక, రిహార్సల్స్ లోనే ఉన్నాడేమో అన్నది జనాల డౌటు.