Begin typing your search above and press return to search.

‘క్షణం’ సినిమాను చెడగొట్టేలా ఉన్నారే..

By:  Tupaki Desk   |   30 Sep 2017 10:22 AM GMT
‘క్షణం’ సినిమాను చెడగొట్టేలా ఉన్నారే..
X
గత ఏడాది టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమాల్లో ‘క్షణం’ ఒకటి. తెలుగులో అలాంటి ఒక థ్రిల్లర్ వస్తుందని ప్రేక్షకులెవరూ ఊహించలేదు. హాలీవుడ్ స్థాయికి సరితూగేలా ఆ చిత్రాన్ని రూపొందించింది రవికిరణ్ పేరెపు-అడివి శేష్ ద్వయం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు కూడా అమోఘమనే చెప్పాలి. ‘క్షణం’ పొరుగు భాషల వాళ్లను కూడా బాగానే ఆకర్షించింది. తమిళం.. కన్నడ.. హిందీ భాషల్లో రీమేక్ కోసం హక్కులు తీసుకున్నారు. తమిళంలో ‘సత్య’ పేరుతో ‘క్షణం’ రీమేక్ అయిపోయింది కూడా. దాని ట్రైలర్ చూస్తే.. దాదాపుగా తెలుగు వెర్షన్ లాగే కనిపిస్తోంది. ఐతే ‘క్షణం’ హిందీ రీమేక్ గురించి వినిపిస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ‘బాగి’ సినిమాకు సీక్వెల్ గా ‘బాగి-2’ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో టైగర్ నిజ జీవిత ప్రేయసి దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే వీళ్లిద్దరూ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫొటో కూడా ఒకటి బయటికి వచ్చింది. ఐతే బాలీవుడ్ మీడియా నుంచి వస్తున్న తాజా సమచారం ఏంటంటే.. ‘బాగి-2’.. ‘బాగి’కి సీక్వెల్ కాదట. ఇది ‘క్షణం’ సినిమాకు రీమేక్ అంటున్నారు. ఊరికే ఆకర్షణ కోసం ‘బాగి-2’ అని పేరు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఐతే బాగి-2 అని పేరు పెట్టడం కానీ.. ఈ సినిమా గురించి వినిపిస్తున్న వేరే సంగతులు కానీ వింటుంటే.. ‘క్షణం’ రీమేక్ ను చెడగొట్టేయడం గ్యారెంటీ అని అర్థమవుతోంది. మరి ‘బాగి-2’ నిజంగా ‘క్షణం’ రీమేకేనా అన్నది తెలియాల్సి ఉంది.