Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘అ!’

By:  Tupaki Desk   |   16 Feb 2018 9:15 AM GMT
మూవీ రివ్యూ: ‘అ!’
X
చిత్రం : ‘అ!’

నటీనటులు: కాజల్ అగర్వాల్ - నిత్యా మీనన్ - రెజీనా కసాండ్రా - అవసరాల శ్రీనివాస్ - ఈషా రెబ్బా - ప్రియదర్శి - మురళీ శర్మ తదితరులు
సంగీతం: మార్క్.ఎ.రాబిన్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన - దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని.. నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ‘అ!’. విభిన్నమైన.. ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వంట వండటం చేతకాకుండానే షెఫ్ గా మారిన ఓ కుర్రాడు.. తన ఫీల్డులో తానే అందరి కంటే గొప్ప అని భావించే ఒక మెజీషియన్.. డ్రగ్స్ కు బానిస అయిన ఓ అమ్మాయి.. టైమ్ మెషీన్ కనిపెట్టాలని కష్టపడుతున్న మరో వ్యక్తి.. పెళ్లికి సిద్ధపడ్డ ఒక చిత్రమైన జంట.. ఇలా విభిన్న నేపథ్యాలున్న కొందరు వ్యక్తులు ఉమ్మడిగా ఒక చోట కలుస్తారు. వాళ్ల జీవితాలు ఒకే సమయంలో కీలక మలుపు తిరుగుతాయి. ఆ మలుపేంటి.. వీళ్ల జీవితాలకు ముగింపేంటి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘అ!’ సినిమాను నిర్మించిన నాని అప్పీల్ ఇచ్చాడనే కాదు.. మామూలుగా చూసినా ఈ కథలోని గుట్టు విప్పడం భావ్యం కాదు. అది విప్పేస్తే నిజంగానే ఈ సినిమాలో చూడటానికేమీ మిగలదు. కాబట్టి ఆ గుట్టు జోలికి వెళ్లకుండా ‘అ!’ విశేషాల లోతుల్లోకి వెళ్దాం. ఈ సినిమాకు కేంద్రం కాజల్ అగర్వాల్ పాత్ర. ఆమె ఒక జ్యువెలరీ బ్రాండ్ కోసం చేసిన ప్రకటనలో ‘మీలోని విభిన్న మహిళల కోసం’ అంటూ ఒక క్యాప్షన్ కనిపిస్తుంది. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఈ క్యాప్షన్ చూసి కథ రాయాలనిపించిందో ఏమో తెలియదు. ఆ క్యాప్షన్ తరహాలోనే ఉంటుంది ఈ సినిమా కథ.

ప్రతి వ్యక్తి జీవితంలోనూ వివిధ దశలుంటాయి. ఆయా దశల్లో అప్పటి పరిస్థితుల్ని బట్టి.. ఆ సమయానికి ఉండే పరిణతిని బట్టి ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి. ఈ దశలన్నింటినీ అధిగమించాక.. చివరికి చూసుకుంటే మనలోనే విభిన్న వ్యక్తులు ఉన్న భావన కలుగుతుంది. ‘అ!’ సినిమా ఆసాంతం చూశాక ఈ కథ తాలూకు కోర్ పాయింట్ ఇదే అనిపిస్తుంది. కథ లోతుల్లోకి వెళ్లకుండా సారాంశం తీసుకుంటే సింపుల్ గా ఇదీ ‘అ!’ సినిమా. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల ఊహకందని.. పూర్తి సంప్రదాయ విరుద్ధమైన కథ రాశాడు. ఇలాంటి కథను నమ్మి నిర్మించేందుకు నాని ముందుకు రావడం సాహసమే. ఐతే కొత్తదనం కోరుకునేవాళ్లను మెప్పించే సినిమా ఈ సినిమా మెజారిటీ ప్రేక్షకులకు రుచిస్తుందా అన్నది మాత్రం సందేహమే. సినిమా అంతా అయ్యాక ఇంతకీ వీళ్లేం చెప్పదలుచుకున్నారు అనే ఆలోచన ప్రేక్షకులకు కలిగితే ఆశ్చర్యం లేదు.

ముందుగా ఒక్కొక్కటిగా పాత్రలు పాత్రలు పరిచయం కావడం.. వాళ్ల నేపథ్యాల్ని చూపించడం.. ఆ పాత్రలన్నీ ఒక చోట కలవడం.. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఆ పాత్రలన్నీ ప్రయత్నం చేయడం.. ఈ తరహా కథలు తెలుగులో ఇంతకుముందు కొన్ని వచ్చాయి. ‘ఓం శాంతి ఓం’.. ‘చందమామ కథలు’.. ‘మనమంతా’.. ఈ తరహాలోనివే. ఐతే వాటితో పోలిస్తే ‘అ!’ ఇంకా భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు షాకిస్తుంది. సినిమా మొదట్నుంచి.. చివరి వరకు తర్వాతేంటి అనేది ఊహించలేం. అన్ని పాత్రలూ కాదు కానీ.. కొన్ని క్యారెక్టర్ల తాలూకు నేపథ్యాలు మాత్రం కొత్తగా ఉండి ఆసక్తి రేకెత్తిస్తాయి.

చాలా సీరియస్ గా అనిపించే ఈ కథను అక్కడక్కడా వినోదాత్మకంగా నడిపించేది నాని.. రవితేజల వాయిస్ లతో నడిచే చేప.. చెట్టు పాత్రలే. వీళ్ల మాటలు వినిపిస్తున్నంతసేపూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు ప్రకృతి.. జంతువుల గురించి మంచి సందేశం కూడా ఇచ్చారు. కానీ ఒక చేప.. ఒక చెట్టు ఎంటర్టైన్ చేసిన స్థాయిలో సినిమాలోని మనుషుల పాత్రలు వినోదం పంచకపోవడం ప్రతికూలత. అమ్మాయిలపై లైంగిక వేధింపుల గురించి.. స్వలింగ సంపర్కుల మానసిక స్థితి గురించి.. తానే గొప్ప అనే అహం చూపించడం వల్ల కలిగే నష్టాల గురించి.. ఇలా పలు అంశాలపై చర్చిస్తూ సందేశం ఇచ్చే ప్రయత్నం జరిగింది.

ఐతే ‘అ!’కు కొత్తదనం అనేది ఎంత పెద్ద ప్లస్సో అంత మైనస్ కూడా. ఈ కొత్తదనాన్ని ఎంతమంది ఆస్వాదిస్తారన్నదే పెద్ద సందేహం. అసలు ఈ సినిమా కాన్సెప్టే అంతగా అర్థం కానిది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి సగటు ప్రేక్షకుడు ఇదేం సినిమారా బాబూ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడితే అది అతడి తప్పు కాదు. ఒక ఫిలిం మేకర్ కు ఎంత కొత్త ఆలోచన వచ్చినా.. అతనెంత పరిణతితో ఆలోచించినా.. ఇది అందరికీ అర్థమవుతుందా లేదా.. దీన్ని అందరూ ఆస్వాదించగలరా.. అన్ని విషయాల్నీ జీర్ణించుకోగలరా అన్నది కూడా చూసుకోవాలి. ఇక్కడే ‘అ!’ మిశ్రమానుభూతుల్ని కలిగిస్తుంది. ఇది బాగా లిమిటెడ్ అప్పీల్ ఉన్న సినిమా అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఎంతగా మారినప్పటికీ.. ఈ కాన్సెప్ట్ ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారన్నది సందేహమే. కొందరికిది అద్భుతంగా అనిపించొచ్చు కొందరు అర్థరహితంగానూ అనిపించొచ్చు.

నటీనటులు:

కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీయడమే కాదు.. దానికి న్యాయం చేసే నటీనటుల్ని ఎంచుకోవడం కూడా కీలకమే. ‘అ!’ టీం ఆ విషయంలో విజయవంతమైంది. పాత్రలకు తగ్గట్లుగా మంచి నటీనటుల్ని ఎంచుకుంది. వాళ్లందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. నిత్యామీనన్.. రెజీనా.. ప్రియదర్శి.. అందర్లోకి ఎక్కువ స్కోర్ చేస్తారు. కథకు కేంద్ర బిందువైన కాజల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె టాలెంట్ చూపించడానికి ఇందులో పెద్దగా స్కోప్ ఏమీ లేదు. అవసరాల శ్రీనివాస్.. మురళీ శర్మ.. దేవదర్శిని కూడా బాగా చేశారు. ఐతే రెజీనా.. మురళీ శర్మ పాత్రలతో ముడిపడ్డ సన్నివేశాలు కొంత విసిగిస్తాయి.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘అ!’ ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. మార్క్ ఎ.రాబిన్ నేపథ్య సంగీతం.. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సినిమాకు తగ్గట్లుగా చాలా బాగా కుదిరాయి. సినిమాకు బలంగా నిలిచాయి. ఆర్ట్ వర్క్.. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో నాని-ప్రశాంతి రాజీ పడలేదు. దర్శకుడికి పూర్తిగా సపోర్ట్ చేశారు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచనలు చాలా కొత్తగా అనిపిస్తాయి. తెలుగులో నెవర్ బిఫోర్ అనిపించే కథను.. కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి స్క్రీన్ ప్లే ఇంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో చూసినప్పటికీ ఇది మరింత భిన్నంగా అనిపిస్తుంది. తాను ఏం చెప్పాలనుకున్నాడో అది రాజీ లేకుండా చెప్పాడతను. ప్రశాంత్ రచయితగా.. దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నాడు కానీ.. అతను సగటు ప్రేక్షకుడిని దృష్టిలో ఉంచుకుని కథాకథనాల్ని తీర్చిదిద్దుకుని ఉండాల్సిందనిపిస్తుంది.

చివరగా: అ!.. కొత్తగా ఉంది కానీ!

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre