Begin typing your search above and press return to search.

అప్పుడు OMG డాడీ డిలే.. ఇప్పుడు బుట్టబొమ్మ డిలే!

By:  Tupaki Desk   |   18 Dec 2019 5:49 AM GMT
అప్పుడు OMG డాడీ డిలే.. ఇప్పుడు బుట్టబొమ్మ డిలే!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. పోస్టర్స్.. లిరికల్ సాంగ్స్.. టీజర్ తో 'అల వైకుంఠపురములో' టీమ్ ప్రచారకార్యక్రమాల్లో ముందంజలో ఉంది.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు 'బుట్టబొమ్మ' సాంగ్ టీజర్ ను విడుదల చేస్తామని అల టీమ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అటు ప్రేక్షకులు.. ఇటు అభిమానులు ఈ పాట ప్రోమో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ఈరోజు రావడం లేదు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. "అనుకోకుండా ఎదురైన సాంకేతిక సమస్యల వల్ల ఈరోజు రిలీజ్ కావలసిన బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ను వాయిదా వేస్తున్నాం. ఆలస్యానికి క్షమాపణ కోరుతున్నాం.. త్వరలో కొత్త డేట్ ప్రకటిస్తాం" అంటూ వాయిదా విషయం వెల్లడించారు.

అయితే ఈ విషయం పై కొందరు ఫ్యాన్స్ మాత్రం మండి పడుతున్నారు. గతంలో కూడా OMG డాడీ పాటను విడుదల చేస్తామని చెప్పి సమయానికి విడుదల చేయలేకపోయారని.. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే విడుదల డిలే చేశారని గుర్తు చేస్తున్నారు. అయితే ఆరోజు కనీసం ఒక గంట తర్వాత అయినా పాటను విడుదల చేశారు. ఇప్పుడు మాత్రం పాట ఎప్పటికి వాయిదా వేశారో.. ఆ సంగతి కూడా చెప్పలేదని 'అల వైకుంఠపురములో' టీమ్ పై చిరాకు పడుతున్నారు. అనుకున్న సమయానికి విడుదల చెయ్యలేని పక్షంలో ముందే రిలీజ్ అంటూ ఊదరగొట్టడం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. 'అల వైకుంఠపురములో' టీమ్ కు.. థమన్ భయ్యాకు ఈ రియాక్షన్స్ గమనిస్తున్నారో లేదో.