Begin typing your search above and press return to search.

అవెంజర్స్ 500కోట్ల క్లబ్ లో చేరుతుందా?

By:  Tupaki Desk   |   11 May 2019 6:52 AM GMT
అవెంజర్స్ 500కోట్ల క్లబ్ లో చేరుతుందా?
X
ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ సునామీ వసూళ్ల గురించి తెలిసిందే. అత్యంత వేగంగా 1బిలియన్ డాలర్ (7900కోట్లు) వసూలు చేసిన సినిమాగా .. అత్యంత వేగంగా 2బిలియన్ డాలర్ (16000 కోట్లు) వసూలు చేసిన సినిమాగా ఎండ్ గేమ్ రికార్డులకెక్కింది. అవతార్.. స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్.. బ్లాక్ పాంథర్ .. టైటానిక్.. ఇన్ ఫినిటీ వార్.. జురాసిక్ వరల్డ్ వంటి సంచలన సినిమాల రికార్డుల్ని అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్రేక్ చేసింది. ఇప్పటికీ రికార్డుల్ని వేటాడుతూ 3బిలియన్ డాలర్ క్లబ్ వైపు ఈ చిత్రం ప్రయాణిస్తోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ సినిమా అమెరికా, చైనా, భారత్ సహా అన్ని చోట్లా రికార్డుల్ని వేటాడింది.

ఇండియా రికార్డుల్ని పరిశీలిస్తే.. ఇప్పటికే దాదాపు 340 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మూడోవారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అవెంజర్స్ సిరీస్ లో చిట్టచివరి సినిమాగా రిలీజైన ఈ చిత్రంపై ఎమోషన్.. సెంటిమెంట్ బలంగా పని చేయడంతో ఆ స్థాయి వసూళ్లను సాధించిందని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఇండియాలో ఈ సినిమా తొలివారం 260.40 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో 77.95కోట్లు వసూలు చేసి ఓవరాల్ గా 338.35కోట్ల నెట్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. మొదటి రోజు 50కోట్లు.. రెండో రోజుకు 100కోట్లు.. మూడో రోజుకు 150 కోట్లు .. ఐదు రోజులకు 200కోట్లు.. ఏడో రోజుకు 250కోట్లు.. పదో రోజుకు 300 కోట్లు వసూలు చేసింది.

ఆ మేరకు ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్స్ బాక్సాఫీస్ వివరాల్ని వెల్లడించారు. 340 కోట్ల నెట్ వసూళ్లు అంటే గ్రాస్ అంతకుమించి. అంటే సుమారు 400 కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసి ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో గ్రాస్ పరంగా 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినా నెట్ అంత వసూలు చేస్తుందా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మునుముందు పలు క్రేజీ బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అవెంజర్స్ మానియా మహర్షి రిలీజ్ తర్వాత చాలా వరకూ తగ్గిపోయిందని తెలుస్తోంది.