Begin typing your search above and press return to search.

వామ్మో.. పది రోజుల్లోనే 6600 కోట్ల వసూళ్లా?

By:  Tupaki Desk   |   6 May 2018 11:58 AM GMT
వామ్మో.. పది రోజుల్లోనే 6600 కోట్ల వసూళ్లా?
X
గత వారం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ బరిలోకి దిగింది ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’. అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. అమెరికా.. ఇండియా అని తేడా లేకుండా విడుదలైన ప్రతి దేశంలోనూ ఈ చిత్రం ప్రకంపనలు రేపుతోంది. కేవలం పది రోజుల వ్యవధిలో ఈ చిత్రం బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడం విశేషం. అంటే రూపాయల్లో చెప్పాలంటే సుమారు 6600 కోట్లన్నమాట.

ఇప్పటిదాకా ప్రపంచ సినీ చరిత్రలోనే ఏ చిత్రం కూడా ఇంత వేగంగా బిలియన్ డాలర్ల వసూళ్లు మార్కును అందుకోలేదు. ఇండియాలో ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్ల మార్కు వైపు పరుగులు పెడుతోంది. తొలి వారాంతంలోనే ఈ చిత్రానికి మన దేశంలో రూ.120 కోట్ల వసూళ్లు దక్కడం విశేషం. ఓ హాలీవుడ్ సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ ఎప్పడూ రాలేదు. రెండో వారాంతంలోనూ ఈ చిత్రం హౌస్ ఫుల్ వసూళ్లతో సాగుతోంది. మల్టీప్లెక్సుల్లో ఈ వీకెండ్లో టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది.

ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలి వారాంతంలోనే 257.6 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి వీకెండ్ వసూళ్ల విషయంలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 2 బిలియన్ డాలర్ల మార్కును దాటే అవకాశముంది. ఈ చిత్రాన్ని డిస్నీ-మార్వెల్ సంస్థలు ఉమ్మడిగా నిర్మించాయి. మార్వెల్ సంస్థ నుంచి ఇది ఆరో బిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. ఈ సంస్థ నుంచి ఇంతకుముందు వచ్చిన ‘బ్లాక్ పాంథర్’ కూడా భారీ వసూళ్లు రాబట్టింది. థానోస్ అనే సూపర్ విలన్ని ఢీకొట్టేందుకు 22 మంది సూపర్ హీరోలు ఒక్కటై ఉమ్మడిగా పోరాడే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.