Begin typing your search above and press return to search.

'న్యూజిలాండ్'లో షూటింగ్ ఆరంభించిన అవతార్ బృందం!

By:  Tupaki Desk   |   18 Jun 2020 11:30 PM GMT
న్యూజిలాండ్లో షూటింగ్ ఆరంభించిన అవతార్ బృందం!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా చిత్ర నిర్మాణ ఫార్మాలిటీలు మొత్తానికి మారిపోయాయి. ప్రొడక్షన్ హౌస్‌లు సాధారణ స్థితికి చేరిన్నప్పటికీ.. 2009లో విడుదలైన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ అవతార్‌కు సీక్వెల్ కోసం.. అవతార్-2 వీరాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే అవతార్-2 షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి ప్రణాళిక మొత్తం సిద్ధం చేశారు. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అయిన అవ‌తార్ సినిమాకి సీక్వెల్స్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న ఇంతకాలం సీక్వెల్ ప‌నులు వాయిదా పడ్డాయి. అంతటా ఇప్పుడిప్పుడే స‌డ‌లింపులు అమలు చేస్తుండటంతో అవ‌తార్ సినిమా సీక్వెల్ పనులు ప్రారంభించారు జేమ్స్ కామెరూన్‌. అందుకోసం 50 మంది టెక్నీషియన్లతో కలిసి గత నెలలోనే న్యూజీలాండ్ చేరుకొన్నారు అవతార్ చిత్రబృందం.

న్యూజిలాండ్ దేశంలోని వెల్లింగ్టన్‌ చేరుకున్న తర్వాత అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అవతార్ చిత్రబృందం అంతా 14 రోజుల సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ కరోనా టెస్టులు నిర్వహించడం జరిగింది. అంద‌రికి నెగెటివ్ రావ‌డంతో తాజాగా అవ‌తార్-2 సినిమా షూటింగ్ మొద‌లు పెట్టారు. స్టోన్‌ స్ట్రీట్‌ స్టూడియోలో సోమ‌వారం షూటింగ్‌ ప్రారంభం అయిందని చెప్తూ స్పాట్‌లో తీసిన ఫొటోను ప్రొడ్యూసర్ జోన్ ల్యాండ్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక ప్ర‌స్తుతం అవతార్ కి సీక్వెల్‌గా అవతార్ - 2.. 3.. 4.. 5లు కూడా రూపొందుతున్నాయట. ఇదిలా ఉండగా నిజానికి అవ‌తార్-2 సినిమాను వచ్చే ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేస్తామని జేమ్స్ కామెరూన్ ప్ర‌క‌టించారు. కానీ కరోనా బ్రేక్ వల్ల షూటింగ్ కి అంతరాయము కలగడంతో మళ్లీ విడుదల తేది వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.