Begin typing your search above and press return to search.

'అవతార్ 2' ట్రైలర్: సరికొత్త ఊహా లోకంలోకి తీసుకెళ్లిన కామెరూన్..!

By:  Tupaki Desk   |   2 Nov 2022 1:31 PM GMT
అవతార్ 2 ట్రైలర్: సరికొత్త ఊహా లోకంలోకి తీసుకెళ్లిన కామెరూన్..!
X
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ వెండి తెరపై సృష్టించిన విజువల్ వండర్ ''అవతార్''. 2009 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్.. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించి. బాక్సాఫీస్ వద్ద ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు 13 ఏళ్ళ తర్వాత రాబోతున్న ''అవతార్ 2'' సినిమాపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

'అవతార్' సినిమాకి కొనసాగింపుగా మరో నాలుగు సినిమాలు చేస్తున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇందులో భాగంగా ముందుగా ''అవతార్: ది వే ఆఫ్ వాటర్'' ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మోస్ట్ ఎవైటెడ్ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా మరో కొత్త ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు.

'అవతార్' సినిమాతో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్ కామెరూన్.. ఇప్పుడు ''అవతార్ 2'' లో సముద్ర గర్భంలోని తీసుకెళ్లి మరో సరికొత్త ఊహా లోకాన్ని పరిచయం చేశారు. సముద్రంపై అవతార్స్ చేస్తున్న విన్యాసాలు మరియు అబ్బురపరిచే గ్రాఫిక్స్ కనువిందు చేస్తున్నాయి.

“అవతార్: ది వే ఆఫ్ వాటర్” సినిమా సుల్లీ కుటుంబం గురించి చూపిస్తోంది. వారు అనుసరించే ఇబ్బందులు.. ఒకరినొకరు సురక్షితంగా ఉంచడానికి వారు పడుతున్న కష్టాలు బాధలు మరియు వారు అనుభవించే విషాదాలు.. సజీవంగా ఉండటానికి వారు చేసే యుద్ధాల కథను ఈ సీక్వెల్ లో చెప్పనున్నారు.

తొలి భాగంలో నటించిన సామ్ వర్డింగ్టన్ మరియు జోయా సాల్జానాలతో పాటు కేట్ విన్సెలెట్ కూడా ఈ సినిమాలో నటించారు. ఫస్ట్ పార్ట్ కు మించి 'అవతార్-2' విజువల్ వండర్ గా ఉంటుందని ఈ బ్రాండ్ న్యూ ట్రైలర్ హామీ ఇస్తోంది.

“అవతార్: ది వే ఆఫ్ వాటర్” చిత్రాన్ని లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. 2022 డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో 3డీ లో ఈ సినిమా సందడి చేయనుంది. తెలుగుతో పాటుగా అన్ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల కానుంది.

'అవతార్' సినిమా ఇండియాలోనూ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఒక దశాబ్దానికి పైగా ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'అవతార్' నిలవగా.. 2019లో 'అవెంజర్స్ -ఎండ్ గేమ్' ఆ రికార్డుల్ని బ్రేక్ చేసింది. అయితే చైనాలో రీ-రిలీజ్ కలెక్షన్స్ తో ''అవతార్'' మళ్ళీ వరల్డ్ నెం.1 గా అవతరించింది. ఇప్పుడు ''అవతార్ 2'' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇకపోతే 'అవతార్-3' చిత్రాన్ని 2024 డిసెంబర్ లో.. 'అవతార్-4' ని 2026 డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక చివరి భాగం 'అవతార్-5' ను 2028 డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు జేమ్స్ కామెరూన్ అప్పట్లోనే ప్రకటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.