Begin typing your search above and press return to search.

ఆశలు రేపుతున్న ఆగస్టు

By:  Tupaki Desk   |   5 Aug 2018 11:00 PM IST
ఆశలు రేపుతున్న ఆగస్టు
X
రంగస్థలం.. భరత్ అనే నేను.. మహానటి లాంటి సినిమాలతో ఈ వేసవి మోతెక్కిపోయింది. ప్రేక్షకులకు బోలెడంత వినోదం అందింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా బాక్సాఫీస్ డల్లయిపోయింది. జూన్ జులై నెలల్లో వచ్చిన సినిమాల్లో ఒక్క ‘ఆర్ ఎక్స్ 100’ మినహా సినిమాలేవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. థియేటర్లు వెలవెలబోయాయి. ఒక్కసారిగా బాక్సాఫీస్ ప్లంపులో పడిపోయింది. ఐతే ఆగస్టులో మంచి మంచి సినిమాలు లైన్లో ఉండటంతో బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతుందన్న ఆశలు కలిగాయి. అందుకు తగ్గట్లే తొలి వారంలో వచ్చిన రెండు సినిమాలు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. ఈ శుక్రవారం విడుదలైన ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాలకూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ‘గూఢచారి’ హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ‘చి ల సౌ’ కూడా దాని స్థాయిలో బాగానే ఆడుతోంది.

ఆగస్టులో రాబోతున్న మిగతా సినిమాల మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దిల్ రాజు నుంచి వస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా ఆగస్టు 9న రాబోతోంది. మరుసటి రోజు రానున్న కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం-2’ మీదా మంచి అంచనాలే ఉన్నాయి. ‘విశ్వరూపం’ వచ్చిన ఐదేళ్లకు ఈ చిత్రం విడుదలవుతున్నప్పటికీ ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి నిలిచే ఉంది. ఇక ఆగస్టు 15న రాబోతున్న విజయ్ దేవరకొండ సినిమా ‘గీత గోవిందం’కూ మంచి హైప్ ఉంది. ఇక నెలాఖర్లో విడుదల కానున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’.. ‘నర్తనశాల’ సినిమాల మీదా అంచనాలు బాగానే ఉన్నాయి. మొత్తానికి ఆగస్టు నెల మళ్లీ బాక్సాఫీస్ కు మంచి ఊపునిచ్చేలాగే కనిపిస్తోంది.