Begin typing your search above and press return to search.

సినిమా పెద్దదైనా చిన్నదైనా ఆ రూల్ తో రూ.200 బాదేస్తున్నారే!

By:  Tupaki Desk   |   30 Dec 2019 9:11 AM GMT
సినిమా పెద్దదైనా చిన్నదైనా ఆ రూల్ తో రూ.200 బాదేస్తున్నారే!
X
సింగిల్ థియేటర్ల టికెట్ ధరలు ఎలా ఉన్నా.. మల్టీఫ్లెక్సుల్లో మాత్రం రూ.138 వసూలు చేస్తున్నారు. కొన్ని అల్ట్రా పోష్ గా ఉన్న మల్టీఫ్లెక్సులు తమ టికెట్ల ధరల్ని రూ.200 ఫిక్స్ చేశాయి. కొత్త సినిమాలకు మొదటి రెండు వారాల పాటు టికెట్ల ధరల్ని రూ.200 వరకూ పెంచేందుకు వీలుగా ఉన్న రూల్ సంగతి తెలిసిందే.

దీన్ని అడ్డుపెట్టుకున్న మల్టీఫ్లెక్సులు ఈ మధ్య విపరీతంగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోలు.. పెద్ద బడ్జెట్ సినిమాలకు రూ.200 వసూలు చేయటాన్ని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. న్యాయంగా చూస్తే..ప్రేక్షకుల ఆసక్తిని థియేటర్లు రూల్ ముసుగులో క్యాష్ చేసుకుంటున్నాయని చెప్పాలి. నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రేక్షక దేవుళ్లు అంటారే కానీ.. వారి మీద భారం పడకుండా చర్యలు తీసుకోవటం కనిపించదు.

అంతాదాకా ఎందుకు? పైరసీ వద్దు.. థియేటర్ కు వచ్చి సినిమాలు చూడాలని కోరే సినీ ప్రముఖులు.. ప్రజలు తమకుతాముగా థియేటర్లు వచ్చేలా ఎందుకు ప్రయత్నించరన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. 200 గ్రాముల కంటే తక్కువ పాప్ కార్న్ కు ఏకంగా రూ.200 పైనే వసూలు చేసేస్తూ.. తినుబండారాలుఏమైనా సరే రెండు వంద నోట్లు ఖర్చు పెట్టనిదే రానట్లుగా మార్చేయటం దేనికి నిదర్శనం?

ఇలాంటివాటి మీద నోరు విప్పని సినీ ప్రముఖులపై సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద హీరోలు తమ రెమ్యునరేషన్ ను కోట్లకు కోట్లు పెంచేసుకోవటం.. చివరకు ఆ భారాన్ని సగటు ప్రేక్షకుడి మీదకు బదిలీ చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రేక్షకుల్లో తమకున్న క్రేజ్ ఉన్న నటులు ఎవరూ తమ సినిమాను రూ.138 కంటే ఎక్కువ వసూలు చేయకుండా నిర్మాతకు కండీషన్ పెట్టే దమ్ము ఉందా? అన్న ప్రశ్నకు మౌనమే సమాధానం అవుతోంది.

సినిమా మీద అభిమానంతో మొదటి రెండు వారాల్లోనే సినిమాను చూసేయాలన్న తొందరకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పెద్ద హీరోలు.. క్రేజీ మూవీస్ కు మాత్రమే కాదు.. డబ్బింగ్ సినిమాలు కూడా తొలి రెండు వారాల రూల్ ను అడ్డు పెట్టేసుకొని భారీగా బాదేస్తున్న వైనం షాకింగ్ గా మారింది. ఇటీవల కార్తీ నటించిన దొంగ సినిమానే చూస్తే.. ఆ సినిమా రోటీన్ కు భిన్నంగా ఉందన్న టాక్ వచ్చినా థియేటర్లు ఖాళీగా ఉంటున్న పరిస్థితి. కారణం.. ఈ డబ్బింగ్ సినిమా టికెట్ ను సైతం రూ.200 చేయటమే. దీంతో.. డబ్బింగ్ సినిమాకు బాదేయటమా? అన్న కోపంతో పలువురు ఉన్నట్లుగా చెప్పక తప్పుదు.

రెండు వారాల పాటు ధరలు పెంచేస్తే.. మరో వారం.. రెండు వారాలు ఓపిక పడితే ఎంచక్కా అమెజాన్ లో కానీ నెట్ ఫ్లిక్ లో కానీ విడుదల అవుతుంది కదా? దాని కోసం అన్నేసి డబ్బులు ఖర్చు చేసేయాలా? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. దబాంగ్ 3 పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమా టికెట్ ధరను రూ.200చేసేశారు. దీంతో.. సినిమాకు మంచి టాక్ వచ్చినా.. ఇప్పుడు థియేటర్లు నిండని పరిస్థితి.

కొండ నాలికకు ముందు వేస్తే.. ఉన్న నాలిక పోయిన చందంగా.. రూల్ ను అవకాశంగా తీసుకొని.. కొత్తగా విడుదలయ్యే చాలా సినిమాలకు రూ.200లతో బాదేయటం మొదటికే మోసంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మరీ.. మాటలు నిర్మాతలకు.. మల్టీఫ్లెక్సులకు వినిపిస్తాయా?