Begin typing your search above and press return to search.

ప్రేక్ష‌కుడు ఆగ్ర‌హించాడు.. థియేట‌ర్ గేమ్ ఓవ‌ర్‌!

By:  Tupaki Desk   |   18 Dec 2021 10:36 AM GMT
ప్రేక్ష‌కుడు ఆగ్ర‌హించాడు.. థియేట‌ర్ గేమ్ ఓవ‌ర్‌!
X
ప్రేక్ష‌కుడికి వినోదాన్ని అందించే థియేట‌ర్లు కొన్ని సంద‌ర్భాల్లో ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంటారు. కొన్ని సార్లు అది భ‌రించ‌క త‌ప్ప‌దు. కానీ ఓ ప్రేక్ష‌కుడు మాత్రం తాను మాత్రం భ‌రించ‌న‌ని ఓ థియేట‌ర్ యాజ‌మాన్యానికి చుక్క‌లు చూపించాడు. ప్ర‌క‌ట‌న‌ల పేరుతో వారు ఆడుతున్న ఆట‌కు చెక్ పెట్ట‌డ‌మే కాకుండా థియేట‌ర్ యాజ‌మాన్యానికి త‌గిన రీతిలో బుద్ది చెప్పి వారితో జ‌రిమానా కూడా క‌ట్టించాడు. ప్ర‌స్తుతం ఈ సంఘ‌ట‌న హాట్ టాపిక్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే...

2019 జాన్ 22న హైద‌రాబాద్ కు చెందిన విజ‌య్‌ గోపాల్ అనే వ్య‌క్తి `గేమ్ ఓవ‌ర్` అనే సినిమా చూడ‌టానికి కాచిగూడ‌లోని ఐనాక్స్ థియేట‌ర్ కి వెళ్లాడు. సినిమా టిక్కెట్ పై వున్న స‌మయం ప్ర‌కారం సాయంత్రం 4:30 గంట‌ల‌కు ప్ర‌ద‌ర్శించాలి. కానీ ఐనాక్స్ థియేట‌ర్స్ సిబ్బంది 15 నిమిషాలు ఆల‌స్యంగా 4:45 గంట‌ల‌కు షోని ప్రారంభించారు. దాంతో 15 నిమిషాల పాటు ప్ర‌క‌ట‌న‌లు వేసి త‌న విలువైన స‌మ‌యాన్ని వృధా చేశారంటూ విజ‌య్ గోపాల్ థియేట‌ర్ మేనేజ‌ర్ కు ఫిర్యాదు చేశారు. తాను ప‌ట్టించుకోకపోవ‌డంతో కంజ్యూమ‌ర్స్ ఫోర‌మ్ లో ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఫిర్యాదులో లైసెన్స్ అథారిటీ హైద‌రాబాద్ క‌మీష‌న‌ర్ ని యాడ్ చేశారు. ఇదిలా వుంటే థియేట‌ర్ యాజ‌మాన్యం మాత్రం సినిమా రెగ్యులేష‌న్ చ‌ట్టం 1955 ప్ర‌కారం తాము ప్ర‌క‌ట‌న‌లు వేసిన‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చింది. ఆర్టిక‌ల్ 19(1)(2), (ఎ) ప్ర‌కారం ప్ర‌క‌ట‌న‌లు వేసే హ‌క్కు మాకు వుంద‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం సమాధానం చెప్పింది. దీనిని ప‌రిశీలించిన జిల్లా వినియోగ‌దారుల ఫోరం నిబంధ‌న‌ల ప్ర‌కారం 5 నిమిషాలే ప్ర‌క‌ట‌న‌లు వేయాల్సి వుంటుందని క్లారిటీ ఇచ్చింది. 15 నిమిషాలు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ వేయడం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేక‌మ‌ని స్పష్టం చేసి ఐనాక్స్ సంస్థ వాద‌న‌ని త‌ప్పుప‌ట్టింది. అంతే కాకుండా తెలంగాణ సినిమాస్ రెగ్యులేష‌న్ చ‌ట్టం 1970, రూల్ నెం. 41 ప్ర‌కారం కేవ‌లం నిమిషాలు మాత్ర‌మే ప్ర‌క‌ట‌న‌లు చేసే హ‌క్కుంద‌ని పేర్కొంది.

ఈ నేప‌థ్యంలో కేసు వేసిన విజ‌య్ గోపాల్ కి రూ. 5 వేలు, కేసు ఖ‌ర్చుల కింత మ‌రో 5 వేలు చెల్లించాల‌ని ఐనాక్స్ లీజ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ను ఆదేశించింది. అలాగే హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ ల‌క్ష రూపాయ‌లు జ‌రిమానా క‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో ఈ కేసు వివాదం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇదే అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రేక్ష‌కుడు ఆగ్ర‌హించాడు.. థియేట‌ర్ గేమ్ ఓవ‌ర్ అయింద‌ని నెట్టింట ఈ న్యూస్ ని వైర‌ల్ చేస్తున్నారు.