Begin typing your search above and press return to search.

జాతీయ గీతం వ‌స్తున్న వేళ నిల‌బ‌డ‌ని న‌టుడ్ని కొట్టాడు!

By:  Tupaki Desk   |   7 Jun 2019 5:33 AM GMT
జాతీయ గీతం వ‌స్తున్న వేళ నిల‌బ‌డ‌ని న‌టుడ్ని కొట్టాడు!
X
మిగిలిన చ‌ర్చ ఎలా ఉన్నా.. జాతీయ గీతాన్ని ఆల‌పిస్తున్న వేళ‌.. గౌర‌వ మ‌ర్యాద‌ల్ని ఇవ్వటం చాలా అవ‌స‌రం. దేశ‌మంటే చాలా భ‌క్తి ఉంద‌న్న మాట‌తో స‌రిపోదు. చేత‌ల్లో అంతో ఇంతో చేసి చూపించాల్సిందే. తాజాగా ఈ విష‌యం మీద జ‌రిగిన ర‌చ్చ పెరిగి పెద్ద‌ది కావ‌ట‌మే కాదు.. పోలీసు స్టేషన్లో కేసుల వ‌ర‌కూ వెళ్లింది. హైద‌రాబాద్ లోని పీవీఆర్ సినిమాస్ లో ఒక నటుడు జాతీయ గీతాన్ని ఆల‌పిస్తున్న వేళ‌.. లేచి నిల‌బ‌డ‌ని తీరు వివాదంగా మారింది.
బంజారాహిల్స్ రోడ్డు నెంబ‌రు 2లో ఉన్న ఆర్కే సినీప్లెక్స్.. పీవీఆర్ సినిమాస్ లో చిత్ర‌పురి కాల‌నీకి చెందిన న‌టుడు కార్తీక్ హిప్పి మూవీకి వెళ్లారు.

సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆల‌పించ‌టం.. ఆ సంద‌ర్భంలో అంద‌రూ నిల‌బ‌డ‌టం తెలిసిందే. అయితే.. కార్తీక్ మాత్రం నిల‌బ‌డ‌కుండా సీట్లో కూర్చున్నాడు. జాతీయ గీతం పూర్తి అయ్యాక ప‌ద్మారావు న‌గ‌ర్ కు చెందిన వ్యాపారి శ్వేత హ‌ర్ష్ ఇదేం ప‌ద్ద‌తి అంటూ కార్తీక్ ను ప్ర‌శ్నించారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం తొలుత‌.. లేచి నిల‌బ‌డ‌క‌పోవ‌టానికి కార‌ణం ఏమిట‌న్న ఆరాగా అడ‌గ్గా.. కార్తీక్ దురుసుగా స‌మాధానం ఇవ్వ‌టం.. నా ఇష్టం.. న‌న్ను అడ‌గ‌టానికి నువ్వెవ‌రు? అంటూ అస‌భ్యప‌ద‌జాలంతో దూషించాడు. దీంతో.. ఆగ్ర‌హానికి గురైన హ‌ర్ష్ దాడికి దిగారు. ఇరువురి మ‌ధ్య కాసేపు ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఇది జ‌రిగిన కాసేప‌టికి.. న‌న్నే కొడ‌తావా అంటూ కార్తీక్ ఆగ్ర‌హంతో దాడికి య‌త్నించారు. దీంతో.. ఈ ఇష్యూ మ‌రింత ముదిరింది.

సినిమా థియేట‌ర్ సిబ్బంది.. సెక్యురిటీ గార్డులు జోక్యం చేసుకొని వారిని శాంతింప‌చేశారు. అయినా.. వారి మ‌ధ్య వివాదం ముగియ‌లేదు. అంత‌కంత‌కూ పెరిగింది. దీంతో.. ఇరువురు బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లారు. ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇరువురి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు.. జ‌రిగిన ఉదంతాన్ని విచారిస్తున్నారు. ఏమైనా రూల్స్ కు భిన్నంగా కార్తీక్్ వ్య‌వ‌హ‌రించి ఉండ‌క‌పోతే ఇంత ర‌చ్చ జ‌రిగేది కాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఒక‌వేళ ఆరోగ్యం సరిగా లేకుంటే.. అదే విష‌యాన్ని నెమ్మ‌దిగా చెప్పి ఉంటే పోయే దానికి ఇంత‌వ‌ర‌కూ వెళ్ల‌టం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.