Begin typing your search above and press return to search.

అరెరే.. ఇంతమంది డైరెక్టర్ల నుంచి ఒక్క సినిమా రాకపాయనే!

By:  Tupaki Desk   |   24 March 2022 12:30 AM GMT
అరెరే.. ఇంతమంది డైరెక్టర్ల నుంచి ఒక్క సినిమా రాకపాయనే!
X
ఒకప్పుడు తెలుగు సినిమా కథలు వీలైనంత వరకూ విలేజ్ ల చుట్టూ తిరిగాయి. తెరపై విమానం కనిపించినా .. విదేశం కనిపించినా ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసి చూసేవారు. ఇంతకుముందు తెరపై హీరో ఫ్యామిలీ కష్టపడుతుంటే, ఆ కష్టాలు చూడలేక ప్రేక్షకులు కర్చీఫ్ లు తడిపేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. తెరపై ఇప్పుడు కూడా హీరోలు కష్టపడతారు .. కానీ ఆ కష్టాల వెనుక పేదరికం ఉండదు. తెరపై హీరో విలేజ్ లోని వీధుల్లోనే తిరుగుతాడు. కానీ ఆ విలేజ్ సెట్ వచ్చి పట్నంలోని ఓ పాతిక ఎకరాల్లో ఉంటుంది.

అందువల్లనే గతంలో కంటే ఇప్పుడు దర్శకులుపడే కష్టం ఎక్కువ. అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించడానికి పడే అవస్థలు ఎక్కువ. ఇదివరకూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తెలుగు సినిమాలు మాత్రమే వచ్చేవి. అడపాదడపా తమిళ అనువాదాలు .. ఒకటీ రెండు హిందీ సినిమాలు. కానీ ఇప్పుడు అలా కాదు .. హాలీవుడ్ సినిమాలు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఏ సినిమాలో నుంచి ఏ పాయింట్ ను టచ్ చేసినా ఆడియన్స్ కి తెలిసిపోతుంది. వివిధ భాషల్లో అందుబాటులో ఉన్న సినిమాలకంటే తమ సినిమా బాగుందనిపించుకోవడం టాలీవుడ్ దర్శకులకు సవాల్ గా మారింది.

ఇక గతంలో సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకుల అభిప్రాయం మేకర్స్ వరకు వెళ్లే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఫస్టు ఆటతోనే పబ్లిక్ టాక్ ఎలా ఉందనేది తెలిసిపోతోంది. అందువల్లనే దర్శకులు కథాకథనాలపై .. పాత్రలను తీర్చిదిద్దే విషయంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయవలసి వస్తోంది. ఫస్టు పోస్టర్ దగ్గర నుంచి వ్యూస్ రికార్డు నమోదవుతూ ఉండటంతో, ప్రతి అంశానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఈ కారణాలగానే గతంలో మాదిరిగా ఒక దర్శకుడి నుంచి ఏడాదిలో రెండు మూడు సినిమాలు రావడం లేదు. రెండు మూడేళ్లకి ఒక సినిమా రావడమే గగనమైపోతోంది.

2017లో వచ్చిన 'బాహుబలి2' తరువాత రాజమౌళి నుంచి వస్తున్నది 'ఆర్ ఆర్ ఆర్' మాత్రమే. 2018లో వచ్చిన 'భరత్ అనే నేను తరువాత కొరటాల మరో సినిమాను థియేటర్లకు తీసుకుని రాలేకపోయారు. ఆయన రూపొందించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అల వైకుంఠపురములో' తరువాత త్రివిక్రమ్ .. ' ఇస్మార్ట్ శంకర్' తరువాత పూరి .. 'సరిలేరు నీకెవ్వరు' తరువాత అనిల్ రావిపూడి ఇంతవరకూ మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాలేకపోయారు.

'సైరా'తో చారిత్రక నేపథ్యాన్ని టచ్ చేసిన సురేందర్ రెడ్డి .. 'మహానటి'తో సావిత్రి బయోపిక్ ను తీసిన నాగ్ అశ్విన్ పరిస్థితి కూడా అంతే ఉంది. వినాయక్ .. బాబీ .. హరీశ్ శంకర్ .. వంశీ పైడిపల్లి కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యేలోగా ఉన్న గ్యాప్ మరింత పెరిగిపోనుంది. తరుణ్ భాస్కర్ .. సందీప్ రెడ్డి వంగ పేర్లను కూడా ప్రేక్షకులు మరిచిపోయే పరిస్థితి వచ్చింది.

ప్రతి కథను శిల్పాల మాదిరి గా చెక్కడం ఒక కారణమైతే .. మరో కారణంగా కరోనా ఎఫెక్ట్ కనిపిస్తోంది. కారణమేదైనా ఈ స్టార్ డైరెక్టర్లందరి నుంచి క్రితం ఏడాదిలో ఒక్క సినిమా కూడా రాకపోవడం వారి అభిమానులను నిరుత్సాహ పరిచే విషయమనే చెప్పాలి.