Begin typing your search above and press return to search.

టీజర్: ఆసక్తికరంగా ఆది సాయికుమార్ 'అతిథి దేవోభవ'

By:  Tupaki Desk   |   21 Dec 2021 5:46 AM GMT
టీజర్: ఆసక్తికరంగా ఆది సాయికుమార్ అతిథి దేవోభవ
X
యువ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ''అతిథి దేవోభవ''. నాగేశ్వర్ పొలిమేర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నువేక్ష హీరోయిన్ గా నటించింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. అలానే 'బాగుంటుంది నువ్వు నవ్వితే' 'గాజుబొమ్మ తీరున' పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 'అతిథి దేవోభవ' సినిమా టీజర్ ను మేకర్స్ లాంచ్ చేశారు. ''నేను అభయ్.. అభయ్ రామ్.. ఈ ప్రపంచంలో ఎవరికైనా మన లోపం గురించి చెప్పుకుంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోగా.. ఆ లోపాన్ని చూసి ఆనందిస్తారని ఆ రోజే నాకు అర్థమైంది'' అంటూ ఆది సాయికుమార్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమైంది.

అభిరామ్ తన ప్రేయసితో ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఓ ఇన్సిడెంట్ వల్ల లైఫ్ లో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నట్లు చూపించారు. అప్పటి నుంచి ఆది సాయికుమార్ ఇద్దరు వ్యక్తులుగా బిహేవ్ చేస్తూ కనిపించారు. అతను భయపడతారు.. ఇతరులను భయపెడతాడు అని టీజర్ లో ప్రస్తావించారు.

'రాముడికి లక్ష్మణుడు వెంటున్నట్లు.. నా భయం ఎప్పుడూ నాతోనే ఉంటుంది' అని ఆది చెప్పడంతో టీజర్ ముగిసింది. ఇందులో రోహిణి - సప్తగిరి - సూర్య - ఆదర్శ్ - రవి ప్రకాష్ - రఘు కారుమంచు - మణిచందన - భెల్ ప్రసాద్ - గుండు సుదర్శన్ - ప్రియాంక - నవీనా రెడ్డి - సత్తిపండు - ఇమ్మాన్యుయేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

లవ్ అండ్ యాక్షన్ కలబోసిన 'అతిథి దేవోభవ' టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రానికి వేణు గోపాల్ రెడ్డి కథ అందించగా.. రజనీ రాజబాబు స్క్రీన్ ప్లే - డైలాగ్స్ రాశారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

'అతిథి దేవోభవ' చిత్రాన్ని రామ సత్యనారాయణ రెడ్డి సమర్పణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజబాబు మిర్యాల - అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇకపోతే ఆది ఈ మూవీతో పాటుగా.. ‘బ్లాక్’ ‘అమరన్‌: ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1’ వంటి చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.