Begin typing your search above and press return to search.

'లక్ష్య' కథ విన్నప్పుడు మొదట భయపడ్డాం..!

By:  Tupaki Desk   |   9 Dec 2021 9:33 AM GMT
లక్ష్య కథ విన్నప్పుడు మొదట భయపడ్డాం..!
X
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ వారు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ స్థాపించి సినిమా నిర్మాణంలోకి దిగిన సంగతి తెలిసిందే. సునీల్ నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్ - పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా సినిమాలను నిర్మిస్తున్నారు. తొలి ప్రయత్నంగా నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబోలో చేసిన 'లవ్ స్టోరీ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు నిర్మాతలిద్దరూ మరో ప్రొడ్యూసర్ శరత్‌ మరార్‌ తో కలిసి నిర్మించిన చిత్రం ''లక్ష్య''.

యువ హీరో నాగశౌర్య - కేతిక శర్మ జంటగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ''లక్ష్య''సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. రేపు శుక్రవారం (డిసెంబర్ 10) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు హైదరాబాద్‌ లో మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

* మా బ్యానర్ లో వచ్చిన ‘లవ్‌ స్టోరి’ మాకు మంచి విజయాన్ని అందించింది. కమర్షియల్‌ గానూ పెద్ద సక్సెస్ అయింది. శేఖర్ కమ్ముల గారు మాకు ఒక‌ మంచి సినిమా ఇచ్చారు. ఆ సమయంలో మాకు వచ్చిన మొత్తం చాలా ఎక్కువే. వారం వారం సినిమాలు మారుతుంటాయి. ఈ వారం ''లక్ష్య'' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

* ఆర్చరీ (విలువిద్య) నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఆ అంశమే అందరినీ ఆకట్టుకుంటుంది. మొదట ఈ కథ విన్నప్పుడు భయపడ్డాం. పూర్తి కథ విన్నాక చేయాలని నిర్ణయించాం. ఆటతోపాటు, బలమైన భావోద్వేగాలు ఉన్న చిత్రమిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లలోనూ.. ఓవర్సీస్‌ లో వంద థియేటర్లలో విడుదల చేస్తున్నాం.

* 'లక్ష్య' సినిమా క్రీడా నేపథ్యంలో రావడమే ప్లస్ పాయింట్. నాగశౌర్య - కేతిక శర్మ చాలా బాగా నటించారు. పాటలు - బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ అద్బుతంగా వచ్చింది. ఆల్రెడీ 'లక్ష్యం' అనే సినిమా వచ్చిందనే ఉద్దేశ్యంతో 'లక్ష్య' అనే టైటిల్‌ ను పెట్టాం.

* ఆడియన్స్ థియేటర్లకి వస్తారా రారా అనే సందేహాలు ఉండేవి. ‘అఖండ’ తో ఆ భయాలన్నీ తొలగిపోయాయి. రెండేళ్ల కిందటే ఈ సినిమా శాటిలైట్‌ - డిజిటల్‌ హక్కులు అమ్మేశాం. ఇప్పుడు థియేటర్‌ లో ప్రేక్షకులు చూడాలనేది మా కోరిక. సినిమాలు చిన్నవా పెద్దవా అనేది కాదు. కథ బాగుంటే ప్రేక్షకులు అన్నీ చూస్తారు.

* సినిమాకి ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ మంచిదే. టికెట్‌ ధరలే ఇబ్బందికరంగా ఉన్నాయి. తెలంగాణలో బాగున్నా.. ఆంధ్రప్రదేశ్‌ లో సమస్యగా ఉంది. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని నమ్ముతున్నాం. మన దగ్గరున్న థియేటర్లు దేశంలో ఎక్కడా లేవు. అత్యాధునిక హంగులతో నిర్మించాం. ప్రేక్షకులు అలాంటి థియేటర్లలోనే సినిమా చూడాలనుకుంటారు. కచ్చితంగా టికెట్‌ ధరలు పెంచాల్సిందే. ఆ ధరలు మరీ ఎక్కువ కాకూడదు.. తక్కువ కాకూడదనేదే మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్‌ లో టికెట్‌ ధరలు మరీ తక్కువగా నిర్ణయించారు. అది నిర్మాతలకి కష్టంగా మారింది.

* ప్రస్తుతం మా సంస్థలో అక్కినేని నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నాం. దీనికి ముందుగా కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే హీరోయిన్‌ ను చూస్తున్నాం. అలానే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నాం. శివ కార్తికేయన్‌ తో ఒక చిత్రం.. సుధీర్‌ బాబుతో ఓ ప్రాజెక్టు చేస్తున్నాం. ఇక సందీప్‌ కిషన్‌ - విజయ్‌ సేతుపతి - గౌతమ్‌ మీనన్‌ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాం.