Begin typing your search above and press return to search.

ధనుష్ కి `రంగ‌స్థ‌లం` లాంటి రిజ‌ల్ట్

By:  Tupaki Desk   |   24 Oct 2019 4:35 PM GMT
ధనుష్ కి `రంగ‌స్థ‌లం` లాంటి రిజ‌ల్ట్
X
స‌రైన కంటెంట్ ప‌డితే స్టార్ డ‌మ్ కి త‌గ్గ‌ట్టే వ‌సూళ్లు ద‌క్కుతాయి అన‌డానికి `రంగ‌స్థలం` గొప్ప ఉదాహ‌ర‌ణ‌. రామ్ చ‌ర‌ణ్ లాంటి అగ్ర క‌థానాయ‌కుడు .. మెగా న‌ట వార‌సుడు అలాంటి ఇండ‌స్ట్రీ హిట్ కొట్ట‌డం కోసం ఎన్నాళ్లు వేచి చూసాడో తెలిసిందే. హిట్లు వ‌చ్చినా సంతృప్తి ప‌డేంత పెద్ద సెన్సేష‌న‌ల్ హిట్ ప‌డ‌క‌పోవ‌డంతో చెర్రీ చాలా ఆశ‌గానే ఎదురు చూశాడు. చివ‌రికి తాను ఆశించిన రేంజు సంచ‌ల‌నం సుకుమార్ `రంగ‌స్థ‌లం`తో సాధ్య‌మైంది. మాస్ కంటెంట్ తో గోదారి నేటివిటీతో కుమ్మేశారు.

స‌రిగ్గా అదే తీరుగా .. అటు కోలీవుడ్ కి వెళితే అచ్చం అలాంటి విజ‌యాన్నే అందుకున్నాడు స్టార్ హీరో ధ‌నుష్. అత‌డు ఇప్పుడే నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు కానీ.. ఇలాంటి ఓ హిట్టు త‌న‌కు అవ‌స‌రం అనుకున్న టైమ్ లో అలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డింది. అదే `అసుర‌న్`. ట్రైల‌ర్ తోనే అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 100 కోట్లు అధిగ‌మించి ఏకంగా 150 కోట్లు వ‌సూలు చేసింది ఇప్ప‌టికే. ధ‌నుష్ కెరీర్ లో తొలి 150 కోట్ల క్ల‌బ్ సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ మాట అటుంచితే ఓవైపు ప్ర‌ముఖులంతా ఈ సినిమా చూసి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.. క‌ర‌ణ్ జోహార్ వంటి దిగ్గ‌జాలు అద్భుత‌మైన సినిమా.. అవార్డులు రావాలి అంటూ పొగిడేశారు. ధ‌నుష్ న‌ట‌న‌కు కితాబిచ్చారు.

ఫ‌క్తు మాస్ కంటెంట్ తో భారీ యాక్ష‌న్ తో వ‌చ్చిన ఈ సినిమా అలాంటి హీరోల‌కే న‌చ్చిందంటే అర్థం చేసుకోవ‌చ్చు. తొలి ఆట నుంచే అసురన్ పై ప్రశంసల వర్షం కురిసింది. టాలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా ధ‌నుష్ కి కితాబు ద‌క్కింది. ఈ విజ‌యంతో ధ‌నుష్ అభిమానుల్లో ఆనందం తారాస్థాయికి చేరుకుంది. త‌మ ఫేవ‌రెట్ నటకు జాతీయ అవార్డు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాని రీమేక్ చేసేందుకు ఇరుగు పొరుగు భాష‌ల నుంచి ప్ర‌య‌త్నాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే.