Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ ఎద‌గ‌రా?

By:  Tupaki Desk   |   16 Dec 2021 10:00 AM IST
రాజ‌మౌళి ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ ఎద‌గ‌రా?
X
రాజ‌మౌళి... దేశ వ్యాప్తంగా ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. `బాహుబ‌లి` సిరీస్ చిత్రాల‌తో అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని తెచ్చుకోవ‌డ‌మే కాకుండా భార‌తీయ తెర‌పై హాలీవుడ్ స్థాయి సినిమాల‌ని మ‌నం కూడా చేయ‌గ‌లం అని యావ‌త్ ప్ర‌పంచానికి చాటిచెప్పిన ద‌ర్శ‌కుడాయ‌న‌. తెలుగు సినిమా కీర్తి ప‌తాకాన్ని ప్ర‌పంచ సినీ య‌వ‌నిపై రెప‌రెప‌లాడించి తెలుగు సినిమాకు. తెలుగు వాడిని గౌర‌వాన్ని తీసుకొచ్చారు. ఈ సినిమా త‌రువాత ఆయ‌న నుంచి సినిమా అంటే యావ‌త్ దేశం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

అయితే ఇలాంటి ద‌ర్శ‌కుడిని ఓ అప‌ప్ర‌ద వెంటాడుతోంది. ఆయ‌న వ‌ద్ద ప‌ని చేసిన ఏ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కానీ.. కో డైరెక్ట‌ర్ కానీ ద‌ర్శ‌కుడిగా నిల‌బ‌డ‌లేడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌. దీనికి నిద‌ర్శ‌నంగా నిలిచిన ద‌ర్శ‌కులు కూడా వున్నారు. రాజ‌మౌళి వ‌ద్ద వ‌ర్క్ చేసిన క‌న్న‌న్ `సారాయి వీర్రాజు` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. విల‌న్ అజ‌య్ ని హీరోగా ప్ర‌మోట్‌ చేస్తూ క‌న్న‌న్ ఈ సినిమా చేశాడు. కానీ పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. ఈ సినిమా జ‌నానికి ఎక్క‌లేదు. ద‌ర్శ‌కుడిగా ఫెయిలైన క‌న్న‌న్ `విక్ర‌మార్కుడు` చిత్రం కోసం ఇచ్చిన `జింతాత జితా జితా` ఐడియా మాత్రం సూప‌ర్ హిట్ అయింది.

ఇక ఆ త‌రువాత రాజ‌మౌళి టీమ్ నుంచి ద‌ర్శ‌కుడిగా ప్ర‌య‌త్నించిన వ్య‌క్తి త్రికోటి. ఇత‌ను కూడా అజ‌య్‌, నాగ‌శౌర్య‌ల‌తో ప్ర‌యోగం చేశాడు. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో త్రికోటి చేసిన చిత్రం `దిక్కులు చూడ‌కు రామ‌య్య‌`. సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ మూవీ ఫ‌ర‌వాలేద‌నిపించినా...ఆ త‌రువాత చేసిన సినిమా అడ్ర‌స్ లేకుండా పోయింది దాంతో డైరెక్ష‌న్ ప‌క్క‌న పెట్టేసి త్రికోటి మ‌ళ్లీ రాజ‌మౌళి టీమ్ లోనే చేరిన‌ట్టుగా చెబుతారు. ఆ త‌రువాత జ‌క్క‌న్న డైరెక్ష‌న్ టీమ్ నుంచి ద‌ర్శ‌కుడిగా ప్ర‌య‌త్నం చేసిన వ్య‌క్తి ప‌ళ‌ని. సిందూర‌పువ్వు కృష్నారెడ్డి త‌న‌యుడు నాగ్ అన్వేష్ హీరోగా ప‌ళ‌ని చేసిన చిత్రం `ఏంజిల్‌`. గ్రాఫిక్స్ ప్ర‌ధానంగా ఫాంట‌సీ క‌థాంశంతో చేసిన ఈ మూవీ ప‌ళ‌నిని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్ట‌లేక‌పోయింది.

ఇక వీరి త‌ర‌హాలోనే రాజ‌మౌళి టీమ్ నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన వ్య‌క్తి మ‌హ‌దేవ్‌. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఈ చిత్రం `మిత్రుడు`. శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. బాల‌కృష్ణ‌ను కొత్త‌గా ప్ర‌జెంట్ చేయాల‌ని ప్ర‌య‌త్నించిన మ‌హాదేవ్ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. పైగా అత‌న్ని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టాల‌ని రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందించిన క‌థ ఏమాత్రం మ‌హాదేవ్ ని స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్ట‌లేక‌పోయింది. ఇలా రాజ‌మౌళి టీమ్ నుంచి ద‌ర్శ‌కుల‌వ్వాల‌ని ప్ర‌య‌త్నించిన న‌లుగురు ద‌ర్శ‌కులు తొలి చిత్రాల‌తోనే ప‌రాజ‌యాల్ని చ‌విచూడ‌టంతో రాజ‌మౌళి వ‌ద్ద డైరెక్ష‌న్ టీమ్ లో వ‌ర్క్ చేసిన వారెవ‌రూ ద‌ర్శ‌కులుగా ఎద‌గ‌రా అనే అప‌ప్ర‌ద మొద‌లైంది. క్రేజీ ద‌ర్శ‌కుడిగా ఇండియా లెవెల్లో మంచి పేరున్నా.. పెద్ద ద‌ర్శ‌కుడిగా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్లో గుర్తింపు పొందినా త‌న టీమ్ మాత్రం ద‌ర్శ‌కులుగా స‌క్సెస్ సాధించ‌లేర‌ని, స్వ‌త‌హాగా ఎద‌గ‌లేర‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోగ‌త కొంత కాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత అయినా రాజ‌మౌళిపై వున్న ఈ అపప్ర‌ద తొల‌గిపోతుందో లేదో చూడాలి.