Begin typing your search above and press return to search.

'స్టూడెంట్ నెంబర్ 1' కోసం ముందుగా అనుకున్నది ఎన్టీఆర్ ని కాదు!

By:  Tupaki Desk   |   12 Aug 2022 3:59 AM GMT
స్టూడెంట్ నెంబర్ 1 కోసం ముందుగా అనుకున్నది ఎన్టీఆర్ ని కాదు!
X
అశ్వనీ దత్ అనగానే ఎవరికైనా సరే వెంటనే వైజయంతీ మూవీస్ గుర్తుకు వస్తుంది. ఆ బ్యానర్ పై వచ్చిన భారీ విజయాలు కళ్లముందు కదలాడతాయి. ఆయన ఈ బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని తరాల వారీగా సినిమాలు చేస్తూ ఈ బ్యానర్ ను 50 ఏళ్ల దిశగా నడిపిస్తూ వచ్చారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ఈ బ్యానర్ లో ఒక సినిమా చేస్తే చాలు అని స్టార్ హీరోలు అనుకునే పరిస్థితి ఉండటం విశేషం. రీసెంట్ గా ఆయన బ్యానర్లో వచ్చిన 'సీతా రామం' కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కారక్రమంలో అశ్వనీదత్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది.

అలీ అడిగిన ప్రశ్నలకు అశ్వనీదత్ స్పందిస్తూ .. "నా బ్యానర్ 'లోగో'లో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా ఉంటారు. ఇప్పటికీ ఎప్పటికీ నేను ఆయనను దైవంగానే భావిస్తూ ఉంటాను. నేను ఎన్టీఆర్ తో సినిమా చేయడానికే ఇండస్ట్రీకి వచ్చాను .. ఇక్కడ తట్టుకోవడం కష్టమని చెప్పేసి ఆయన వెళ్లిపొమ్మన్నా వెళ్లనని చెప్పాను.

ఎన్టీఆర్ తో ఫస్టు సినిమాగా 'ఎదురులేని మనిషి' చేస్తే 16 లక్షలు అయింది. 'యుగపురుషుడు' సినిమాకి 20 లక్షలవరకూ అయింది. మా బ్యానర్ కి మరో ప్రత్యేకథ ఉంది. 'రాజకుమారుడు'తో మహేశ్ బాబు .. 'చిరుత' సినిమాతో చరణ్ .. 'గంగోత్రి' సినిమాతో అల్లు అర్జున్ పరిచయమయ్యారు.

ఎన్టీఆర్ తో 'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాను తీశాము. ఈ కథను విన్న తరువాత ఎవరితో చేస్తే బాగుంటుందా అని ఆలోచన చేస్తున్నాము. కథాపరంగా ప్రభాస్ అయితే బాగుంటాడేమో అని అనుకుంటూ ఉండగా ఒక రోజున హరికృష్ణగారు కాల్ చేశారు. ఆ సమయంలో ఈ సినిమా ప్రస్తావన రావడం .. కథ అటు తిరిగి ఇటు తిరిగి తారక్ కి రావడం జరిగిపోయింది. 'మహానటి' సినిమా కోసం ముందుగా ఒక కథానాయికను అనుకోవడం జరిగింది. ఆ హీరోయిన్ పెట్టుకోవద్దని నేను చెప్పాను. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ తీయాలనేది నా చివరి కోరిక" అన్నారు.

'మహానటి' సినిమాలో ఆయన వద్దని చెప్పిన హీరోయిన్ ఎవరు? 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ ను ఆయన ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఆసక్తికరమైన సమాధానాలు ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలవనున్నాయి. ఇక నిర్మాతగా తన కూతురు స్వప్న తనని డామినేట్ చేయాలనే తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తనకి వారసుడు లేడనే బాధలేదనీ .. ఒకవేళ ఉండి ఉంటే .. తనని హీరోగా పెట్టి సినిమా తీయమంటే మొత్తం పోయేదేమోనంటూ నవ్వేశారు. అశ్వనీదత్ సమయస్ఫూర్తికి అద్దం పట్టే ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది.