Begin typing your search above and press return to search.

అశ్వనీదత్ చెప్పిన ఏడు లక్షల కథ

By:  Tupaki Desk   |   4 Jan 2017 12:41 PM IST
అశ్వనీదత్ చెప్పిన ఏడు లక్షల కథ
X
అప్పట్లో ఒక లక్ష రూపాయలుండి ఆ భూమి కొని ఉంటే ఈ రోజు కోటీశ్వరుడు అయిపోవాణ్నిరా అంటూ పాత రోజుల్ని గుర్తు చేసుకునే మనుషులు చాలామందిని చూస్తుంటాం. ఇప్పుడు అగ్ర నిర్మాత అశ్వనీదత్ కూడా అలాగే ఒకప్పటి రోజుల్లోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు చేతి నిండా డబ్బుతో సినీ పరిశ్రమలోకి వచ్చిన కాలంలోకి వెళ్లిపోయారాయన. దత్ తండ్రి 70ల్లోనే ఎ-1 కాంట్రాక్టర్ అట. ఇంజినీరింగ్ చదువు చదవాల్సిన తాను.. సినిమాల మీద మక్కువతో ప్రొడక్షన్లోకి వచ్చానని.. సినిమాల్ని కూడా వ్యాపారం లాగే చేస్తానని తన తండ్రికి మాటిచ్చి ఇటు వైపు వచ్చానని.. అందుకోసం 1974లోనే తన తండ్రి తనకు ఏడు లక్షల రూపాయల డబ్బిచ్చారని దత్ వెల్లడించాడు.

అంత డబ్బు పట్టుకుని చెన్నైలో దిగి.. సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రెడ్డిని కలిస్తే.. ‘ఓరి నీ దుంపదెగా.. ఇప్పుడు చెన్నైలో ఒక గ్రౌండ్ రూ.4800 పలుకుతోంది. నీ దగ్గరున్న డబ్బుతో ఎన్ని గ్రౌండ్స్ వస్తాయో తెలుసా’’ అని అన్నారని దత్ గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో ఎం.ఎస్.రెడ్డి రియల్ ఎస్టేట్ కూడా చేసేవారని.. ఆయన చెప్పినట్లు తన దగ్గరున్న డబ్బుతో గ్రౌండ్స్ కొనడం మొదలుపెట్టి ఉంటే మొత్తం 120 వచ్చేవని.. వాటి విలువ ఇప్పుడు రూ.400 కోట్లుగా ఉండేదని దత్ అన్నారు. ఐతే రియల్ ఎస్టేట్ వైపు వెళ్లకుండా సినిమాల్లోనే కొనసాగినందుకు తనకేమీ రిగ్రెట్స్ లేవన్నాడు దత్. సినిమాల్లో కూడా బాగానే సంపాదించానని.. తన తండ్రి దగ్గర తీసుకున్న రూ.7 లక్షలు కూడా తిరిగిచ్చేశానని.. ఆ డబ్బుతో పాటు తాను ఇచ్చిన వేరే డబ్బులతో చాలా భూములు డెవలప్ చేశామని.. గన్నవరం దగ్గర 30 ఎకరాల భూమి కూడా కొన్నామని దత్ వెల్లడించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/