Begin typing your search above and press return to search.

అసిస్టెంట్ డైరెక్టర్ గా అభ్యాసం .. 'హీరో'గా ప్రయోగం!

By:  Tupaki Desk   |   11 Jan 2022 2:30 PM GMT
అసిస్టెంట్ డైరెక్టర్ గా అభ్యాసం .. హీరోగా ప్రయోగం!
X
వెండితెరపై హీరోగా కనిపించడమనేది అంత తేలికగా జరిగే పనేం కాదు. అందుకు ఎంతో కసరత్తు చేయాలి .. కష్టాన్ని ఇష్టపడుతూ వెళ్లాలి. ఎంత బలమైన నేపథ్యం ఉన్నప్పటికీ అది ఫస్టు సినిమా తెరపైకి రావడం వరకూ మాత్రమే ఉపయోగ పడుతుంది. రెండవ సినిమా చేయాలంటే జనం నుంచి ఆమోదముద్ర పొందాల్సిందే. అలా ప్రేక్షకుల మెప్పును పొందాలంటే ముందుగా సినిమాపై ఒక అవగాహన పెంచుకోవాలి. తెరపైకి సినిమా రావడానికి ముందు జరిగే తతంగాన్ని దగ్గరగా చూడాలి. ఏ సన్నివేశంలో ఎవరు ఎలా నటిస్తున్నారనేది పరిశీలించాలి.

అందువల్లనే తెరపైకి ఆర్టిస్టులుగా రావడానికి ముందు కొందమంది డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేస్తుంటారు. ఇప్పుడు 'హీరో' సినిమాతో తెరపైకి వస్తున్న గల్లా అశోక్ కూడా, ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు .. అదీ మహేశ్ బాబు మూవీ కోసమే కావడం విశేషం. గల్లా అశోక్ స్వయానా మహేశ్ బాబుకి మేనల్లుడు. అశోక్ కి హీరో కావాలనే ఆలోచన ముందు నుంచి ఉండటం వలన, తన సినిమా 'శ్రీమంతుడు'కి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ అన్ని విషయాలను అబ్జర్వ్ చేయమని మహేశ్ చెప్పాడట.

కొరటాలతో మాట్లాడి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా మహేశ్ బాబు ఉంచడంతో, అశోక్ కొంత సబ్జక్ట్ ను వంట బట్టించుకున్నాడు. కెమెరా వెనుక ఏం జరుగుతుంది? కెమెరా ముందు ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయం ఆయనకి అర్థమైంది. ఆ తరువాత ఆయన రంగంలోకి దిగడానికి రెడీ అయ్యాడు. నిజానికి దిల్ రాజు బ్యానర్ ద్వారా ఈ కుర్రాడు పరిచయం కావలసింది. కానీ కథ సెట్ కాకపోవడం వలన ఆ ప్రాజెక్టు పక్కకి పోయింది. ఇప్పుడు తన సొంత బ్యానర్లోనే అశోక్ 'హీరో' సినిమాను చేశాడు.

శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. గతంలో 'భలే మంచి రోజు' .. ' దేవదాస్' .. 'శమంతకమణి' వంటి సినిమాలతో శ్రీరామ్ ఆదిత్య మంచి పేరు సంపాదించుకున్నాడు. 'భలేమంచి రోజు' సినిమాతో ఆయన సుధీర్ బాబుకి హిట్ ఇచ్చాడు. ఆయనతో ఉన్న పరిచయమే ఇప్పుడు 'హీరో' చేయడానికి కారణమైంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. జగపతిబాబు .. నరేశ్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 15వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాతో, అశోక్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి మరి.