Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డుపై అర‌వింద స్వామి షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   16 Dec 2017 9:49 AM GMT
సెన్సార్ బోర్డుపై అర‌వింద స్వామి షాకింగ్ కామెంట్స్!
X
మంచి క‌థ‌....స్టార్ హీరో - హీరోయిన్లు - న‌టీన‌టులు.....అత్యున్న‌త సాంకేతిక వ‌ర్గం....నిర్మాణ విలువ‌లు....ఇవ‌న్నీ ఒక సినిమా హిట్ కావడానికి స‌హ‌క‌రిస్తాయి. చిత్ర యూనిట్ అహోరాత్రులు క‌ష్ట‌ప‌డి మంచి సినిమాను ప్రేక్ష‌కులకు అందించాల‌ని భావిస్తుంది. అన్ని ప‌నులు పూర్తి చేసుకొని రిలీజ్ చేయ‌బోయే స‌మ‌యానికి కొన్ని సినిమాల‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ లో సినిమాల‌కు బాలారిష్టాలు త‌ప్ప‌డం లేదు. ఎన్ని వ్య‌య‌ప్ర‌యాస‌లకోడ్చి సినిమాను నిర్మించినా చివ‌రకు సెన్సార్ బోర్డు క‌రుణిస్తేనే క‌ట్ లు లేకుండా విడుద‌ల‌వుతోంది. ఒక‌వేళ సెన్సార్ బోర్డు పురిటి నొప్పుల‌ను త‌ట్టుకొని సినిమా బ‌య‌ట‌ప‌డ్డా...ఏదో ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయంటూ ఆందోళ‌న‌లు చేసి విడుద‌ల‌ను ఆపేస్తున్నారు. అటు తిరిగి...ఇటు తిరిగి...అంతిమంగా చిత్ర నిర్మాత‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉడ్తా పంజాబ్ మొద‌లుకొని.....ప‌ద్మావ‌తి వ‌రకు ఈ వివాదాల పరంప‌ర కొన‌సాగుతూనే ఉంది. సెన్సార్ తీరు - కొంత‌మంది ప్ర‌జ‌ల ఆందోళ‌న‌ల‌పై బాలీవుడ్ ప్ర‌ముఖులు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఆ జాబితాలోకి త‌మిళ సీనియ‌ర్ హీరో అర‌వింద స్వామి చేరారు.

ప్ర‌స్తుతం దేశంలో సినిమాలపై దాడులు - న‌టీన‌టుల‌పై బెదిరింపులు పెరిగిపోయాయ‌ని స్వామి అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జ‌లు బాగా సెన్సిటివ్ అయ్యార‌ని - ఒక ముద్దు సీన్ తీయాలన్నా భయమేసే ప‌రిస్థితి క‌ల్పించార‌న్నారు. 2 వేల సంవత్సరాల క్రితం రాసిన వాత్సాయ ‘కామసూత్ర’ను ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. ముద్దు సన్నివేశాలు కేవ‌లం ప్రేమకు సూచిక అని - ముద్దు సన్నివేశాలపై అప్రకటిత నిషేధం ఎందుకు విధించారో తెలియ‌ద‌న్నారు. ఆ విషయంలో సెన్సార్ బోర్డు కఠిన వైఖ‌రిపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సినిమా, ఇతర కళా రంగాల వారికి బెదిరింపులు ఎక్కువ‌య్యాయ‌ని, అహింస‌తో స్వ‌తంత్ర్యం సాధించుకున్న దేశంలో సినిమాల విడుద‌ల విష‌యంలో హింసాత్మ‌క ధోర‌ణులు అవ‌లంబించ‌డం బాధాకరమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది మేలో అర‌వింద స్వామి న‌టించిన `డీయ‌ర్ డ్యాడ్` విడుద‌ల సంద‌ర్భంగా పిల్ల‌లు - త‌ల్లిదండ్రుల బంధంపై స్వామి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. సెక్స్ - బ‌యాల‌జీ - సైన్స్...ఇలా అన్ని విష‌యాల‌గురించి పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దేన‌ని స్టేట్ మెంట్ ఇచ్చారు.