Begin typing your search above and press return to search.

రోబో-2.. పారితోషకాలే రూ.200 కోట్లు

By:  Tupaki Desk   |   14 Oct 2015 11:30 AM GMT
రోబో-2.. పారితోషకాలే రూ.200 కోట్లు
X
తెలుగులో 50 కోట్ల బడ్జెట్ సినిమాలు సర్వ సాధారణమైపోయాయి. కానీ తెరమీద చూస్తే అంత ఖర్చు కనిపించదు. ఈ మాత్రానికే యాభై కోట్లా అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ బడ్జెట్ లో సినిమా కోసం ఖర్చు పెట్టేది సగం కూడా ఉండదు. ప్రొడక్షన్ కంటే కూడా పారితోషకాలకే ఎక్కువ ఖర్చవుతుంది. స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్ కలిశారంటే.. వాళ్లిద్దరికే ఓ 20 కోట్లకు తక్కువ కాకుండా సమర్పించుకోవాలి. మిగతా పారితోషకాలన్నీ కలిపితే లెక్క పాతిక కోట్లకు తక్కువ తేలదు.

ఐతే మన ఇండస్ట్రీ మాత్రమే కాదు.. కోలీవుడ్ - బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి. ఐతే పారితోషకాల విషయంలో ఇప్పటిదాకా ఎన్ని రికార్డులైనా ఉండొచ్చు. ఐతే శంకర్ తీయబోతున్న ‘రోబో-2’తో ఆ రికార్డులన్నీ బద్దలవడం ఖాయం. ఎందుకంటే.. ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్లే ఓ 200 కోట్లు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదంటున్నారు. ఇందులో నటించబోయే ఒక్క నటుడికే వంద కోట్ల పారితోషకం ఇవ్వబోతుండటం విశేషం.

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ రోబో-2లో విలన్ పాత్ర పోషించడం ఖాయమని తేలిపోయింది. అంతే కాదు.. ఆయనకు రూ.100 కోట్ల పారితోషకం ఆఫర్ చేశారట. ఇది మనకు షాకింగ్ గా అనిపించొచ్చు కానీ.. ఆర్నాల్డ్ రేంజికి మామూలు రెమ్యూనరేషనే. ఆయన సినిమాలోకి వస్తే దాని రేంజే మారిపోతుంది కాబట్టి.. ఆ రెమ్యూనరేషన్ వర్త్ ఫులే. ఇక రోబో-2లో హీరోగా నటించే రజినీకి రూ.50 కోట్ల పైనే పారితోషకం ఇవ్వబోతున్నారు. రజినీ లింగా సినిమాకు కూడా ఇంత మొత్తమే తీసుకున్నారు. ఇక రోబో-2 సృష్టికర్త శంకర్ కూడా రికార్డు స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకునే అవకాశముంది. మిగతా నటీనటులందరికిచ్చే డబ్బులు కూడా కలిపితే లెక్క రూ.200 కోట్లకు తక్కువ తేలేలా లేదు. మరి రెమ్యూనరేషన్లకే ఇంతైతే.. సినిమాకు ఎంత ఖర్చు పెట్టిస్తాడో చూడాలి. తక్కువలో తక్కువ రూ.400 కోట్ల బడ్జెట్ తేలినా ఆశ్చర్యమేమీ లేదు.