Begin typing your search above and press return to search.

ఇండియన్ సినిమాలో 245 వ పోలీస్ సినిమా!

By:  Tupaki Desk   |   21 Jun 2019 5:47 AM GMT
ఇండియన్ సినిమాలో 245 వ పోలీస్ సినిమా!
X
ఎప్పుడూ మన టాలీవుడ్ సినిమాలే గొప్పవని.. మన సినిమాల్లో ఉండే కామెడీ ఇంకో చోట ఉండదని అనుకుంటే ఎలా? అప్పుడప్పుడూ ఇతర భాషలలో కూడా ఫన్నీగా ఉండే సినిమాలు వస్తాయి. తాజా బాలీవుడ్ చిత్రం 'అర్జున్ పాటియాలా' అదే కోవలోనిది. దిల్జిత్ దొసాంజ్.. కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దర్శకుడు రోహిత్ జుగ్ రాజ్. వరుణ్ శర్మ.. రోనిత్ రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సన్నీ లియోన్ హాట్ ఐటమ్ నంబర్ కూడా ఉంది.

రెగ్యులర్ బాలీవుడ్ ట్రైలర్లకు భిన్నంగా.. వాటిపై సెటైర్ అన్నట్టుగా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ ప్రారంభంలోనే ఇండియన్ సినిమాల్లో మొట్ట మొదటి పోలీస్ ఫిలిం అంటూ చెప్పగానే.. అజయ్ దేవగణ్ 'సింగం' పోలీస్ యూనిఫాం.. రణవీర్ సింగ్ 'సింబా' పోలీస్ యూనిఫాం లో ఉన్న పోస్టర్లు కనిపిస్తాయి. దీంతో ఆ వాయిస్ ఓవర్ డైలాగ్ మారిపోయి "ఇండియన్ సినిమాలో 245 వ పోలీసు పిక్చర్' అనే ఇంట్రో ఇస్తారు. హీరో దిల్జిత్ ను పరిచయం చేస్తూ "ఈ సినిమా హీరో కండలవీరుడు కాదు.. క్యూట్" అంటారు. తర్వాత అందమైన కృతి సనన్ ను పరిచయం చేస్తారు. హీరో అసిస్టెంట్ గా ఒనిడా సింగ్ అంటూ వరుణ్ శర్మ ను కానిస్టేబుల్ పాత్రలో ఇంట్రో ఇచ్చారు. ఈ సినిమాలు ఐదుమంది విలన్లు కూడా ఉన్నారు.

మరీ 'సింగం' సీరీస్ సినిమాల రేంజ్ లో అంచనాలు పెట్టుకోవద్దనే ఉద్దేశమేమో కానీ ఒక పోలీస్ షూటింగ్ సీన్ చూపిస్తూ "ఈ సినిమాకు బడ్జెట్ కొంచెం తక్కువ" అంటూ క్లారిటీ ఇచ్చారు. పోలీసులు షూట్ చేసిన తర్వాత బ్రిడ్జ్ పైనుంచి ఒక వ్యక్తి నీటిలో పడిపోయే షాట్ అది. కానీ అతనికి అటూ ఇటూ కట్టిన సేఫ్టీ వైర్లు కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అర్థం అయింది కదా గ్రాఫిక్స్ లో వైర్లు తీసేందుకు బడ్జెట్ ఇష్యూ. వీటన్నిటికి తోడు బాలీవుడ్ సినిమాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఐటెం సాంగ్ కూడా మా సినిమాలో ఉందని సన్నీ లియోన్ పాటను చూపించారు. ఫైనల్ టచ్.. ఈ సినిమాకు ఒక సోల్ ఉంది. అదేనండి.. ఒక ఆత్మ కూడా ఉందని తాగుబోతు ఆత్మను అద్దంలో చూపించారు.

ఓవరాల్ గా ట్రైలర్ సరదాగా ఉంది. మరీ రాజుభాయి హీరాని రేంజ్ ఎమోషన్లు.. సంజయ్ లీలా భన్సాలి భారీతనం.. రోహిత్ శెట్టి రేంజ్ స్టంట్స్ ఆశించకుండా ఏదో సరదాగా సాగిపోయే సింపుల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు కాసిన్ని నవ్వులను కన్ఫాంగా ఇచ్చే సినిమానే. ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ చూసేయండి.