Begin typing your search above and press return to search.

చిరు, బాల‌య్య సినిమాల‌కు ఆ ఇద్ద‌రే అడ్డుప‌డుతున్నారా?

By:  Tupaki Desk   |   25 Nov 2022 5:30 PM GMT
చిరు, బాల‌య్య సినిమాల‌కు ఆ ఇద్ద‌రే అడ్డుప‌డుతున్నారా?
X
దిల్ రాజు నిర్మిస్తున్న 'వార‌సుడు' వివాదం రోజు రోజుకీ మ‌రింత‌గా దుమారాన్ని సృష్టిస్తోంది. ఈ సినిమాకు తెలుగు సినిమాలైన 'వాల్తేరు వీర‌య్య‌', 'వీర సింహారెడ్డి' సినిమాల‌కు మించి థియేట‌ర్లు కేటాయిస్తున్నార‌ని వార్త‌లు వినిపించ‌డం.. దీనిపై తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి 'ఫెస్టివెల్స్ స‌మ‌యంలో తెలుగు సినిమాల‌కే ప్రాధాన్య‌త నివ్వాల‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డం.. అది వివాదంగా మార‌డం.. దానిపై అల్లు అర‌వింద్‌, అశ్వ‌నీద‌త్ ఘాటుగా స్పందించ‌డం తెలిసిందే.

ఇక వీరితో పాటు త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి పై నిప్పులు చెర‌డం, ప్ర‌క‌ట‌న‌ని వెన‌క్కి తీసుకోక‌పోతే 'వారీసు'కు ముందు సినిమా.. 'వారీసు' త‌రువాత సినిమా అనే స్థాయిలో వుంటుంద‌ని హెచ్చ‌రించ‌డం దానికి వంత‌పాడిన‌ట్టుగా అల్లు అర‌వింద్‌, అశ్వ‌నీత్ మాట‌లు వుండ‌టం తెలిసిందే. ఈ వివాదంపై స్పందించిన తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి. ప్ర‌స‌న్న‌కుమార్ తాము ఎక్క‌డా డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌కూడద‌ని, ఆయా సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌రాద‌ని తాము అన‌లేద‌ని వివర‌ణ ఇచ్చారు.

తాజాగా మ‌రోసారి ఆయ‌న ఈ వివాదంపై మ‌రింత ఘాటుగా స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అంతే కాకుండా 'వాల్తేరు వీర‌య్య‌', 'వీర సింహారెడ్డి' సినిమాల‌ను అడ్డుకుంటోంది అల్లు అర‌వింద్, అశ్వ‌నీద‌త్ అంటూ బాంబ్ పేల్చారు. ఇందులో వివాదం ఏమీ లేద‌ని, సంక్రాంతి మ‌న‌కు పెద్ద పండ‌గ అని, ఆ కార‌ణంగానే తెలుగు సినిమాల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌ని కోరుతున్నామన్నారు.

అంతే కాకుండా ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు అగ్ర నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, అశ్వ‌నీదత్ మాట్లాడిన తీరుని త‌ప్పుబ‌ట్టారు. వారు విజ‌య్ 'వార‌సుడు'కు థియేట‌ర్లు ఇవ్వాల‌ని చెబుతున్నారు.

అంటే మ‌న తెలుగు సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వొద్ద‌ని చెబుతున్న‌ట్టేగా. ఇదే అశ్వ‌నీద‌త్ త‌ను నిర్మించిన 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' త‌మిళ‌నాడులో రిలీజ్ చేస్తే ఫ్లాప్ అయింది. ఇక్క‌డ హిట్ అయితే అక్క‌డ ఫ్లాప్ అయింది. త‌మిళ ప్రేక్ష‌కులు ఆ సినిమాని ఓ ఫ‌న్నీగా తీసుకుని చూడ‌లేదు. అంతే కాకుండా అశ్వ‌నీద‌త్ ఇటీవ‌ల మాట్లాడుతూ ఒకే నిర్మాత రెండు సినిమాల‌ని ఎలా రిలీజ్ చేస్తాడ‌ని అడిగారు. దీనిపై కూడా ప్ర‌స‌న్న కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. పండ‌క్కి తెలుగు సినిమాలు రెండూ విడుద‌లైతే మంచిదేగా అన్నారు.

ఇక అల్లు అర‌వింద్ గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. 2017లో ఇదే స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు డ‌బ్బింగ్ సినిమాలు ఎలా రిలీజ్ చేస్తార‌ని మాట్లాడిన అల్లు అర‌వింద్ ఇప్ప‌డు ఎందుకు మాట మార్చి డ‌బ్బింగ్ సినిమాకు ఎల్ల‌లు లేవు ఎక్క‌డైనా ఆడొచ్చాన్నాడు. ఇలా త‌ను అన్న మాటే మారుస్తున్నారు అని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఇండ‌స్ట్రీలో చాలా మందికి పౌరుషం లేదు.అంతా సొంత ప్ర‌యోజ‌నాల కోస‌మే మాట్లాడుతున్నారు. ఇండ‌స్ట్రీని కాపాడు కోవాల‌ని ఎవ‌రికీ లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌స‌న్న కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌పై అల్లు అర‌వింద్‌, అశ్వ‌నీద‌త్ ఎలా స్పందిస్తారో చూడాల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.