Begin typing your search above and press return to search.

ఇంతకీ ఆ సినిమాలు ఉన్నట్టా లేనట్టా..?

By:  Tupaki Desk   |   4 Nov 2022 8:00 AM IST
ఇంతకీ ఆ సినిమాలు ఉన్నట్టా లేనట్టా..?
X
సినిమా అనేది ఎంతో వ్యవ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. కొబ్బరికాయ కొట్టి సినిమాని ప్రారంభించిన దగ్గర నుంచి.. షూటింగ్ పూర్తి చేసే వరకూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడలేని సినిమాలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. కొన్ని చిత్రాలు కొంత భాగం చిత్రీకరణ జరిగిన తర్వాత ఆగిపోతే.. మరికొన్ని అనౌన్స్ మెంట్ కే పరిమితం అవుతుంటాయి. కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కూడా మధ్యలోనే అటకెక్కుతుంటాయి. ఇంకొన్ని సినిమాలు అసలు సెట్స్ మీదకు వెళ్తాయో లేదో చెప్పలేని సందిగ్ధ పరిస్థితిలో ఉంటాయి.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సైన్ చేసిన ప్రాజెక్ట్స్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' మరియు సురేందర్ రెడ్డి తో ఓ మూవీ ఉన్నాయి. ఆ తర్వాత సముద్ర ఖని డైరెక్షన్ లో 'వినోదం సీతమ్' రీమేక్ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయి.. అసలు సజీవంగా ఉంటాయా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు.

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా కంటే ముందే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్: కనబడుటలేదు' అనే చిత్రాన్ని ప్రకటించారు. 'పుష్ప' తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఓ మూవీకి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. ఆ ప్రాజెక్ట్స్ గురించి ఇక అందరూ మర్చిపోవాల్సిందే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న చిరంజీవి.. వెంకీ కుడుములతో ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ సినిమాని పక్కన పెట్టేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ 'లైగర్' రిలీజ్ అవ్వకముందే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వెంటనే 'జనగణమన' అనే పాన్ ఇండియా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. రెండు చిన్న షెడ్యూల్స్ షూటింగ్ చేసిన ఈ మూవీని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నట్లుగా టాక్ వచ్చింది. ఇక సుకుమార్ డైరెక్షన్ లో VD హీరోగా ఓ సినిమాని అనౌన్స్ చేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది తెలియడం లేదు.

నాగ‌చైత‌న్య మరియు ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌ లో ఓ సినిమాని ప్రకటించారు. అయితే పరశురామ్ 'సర్కారు వారి పాట' కోసం వెళ్లడంతో అది హోల్డ్ లో పడింది. ఇప్పుడు చైతూ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటాన్ని బట్టి చూస్తే.. అప్పట్లో ఆగిపోయిన మూవీ ఇప్పట్లో ఉంటుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. డైరెక్టర్ మాత్రం తన నెక్స్ట్ చిత్రం చైతన్యతోనే అని చెప్పాడు. కానీ ఇప్పుడేమో బాలకృష్ణతో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

గుణ‌శేఖ‌ర్ అప్పట్లో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో 'హిర‌ణ్య క‌శ్య‌ప‌' అనే సినిమా చేయనున్నట్టు తెలిపారు. కొన్నేళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసారు. కానీ అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. కాకపోతే భవిష్యత్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. నిర్మాత హ‌ఠాన్మ‌ర‌ణంతో నాగ‌శౌర్య 'పోలీస్ వారి హెచ్చ‌రిక‌'.. అల్ల‌రి న‌రేష్ 'స‌భ‌కు న‌మ‌స్కారం' చిత్రాలు కూడా హోల్డ్ లో పడ్డాయి.

మంచు మ‌నోజ్ కూడా 'అహం బ్ర‌హ్మ‌స్మి' అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తలపెట్టాడు. అయితే కొంత‌మేర షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయింది. అలానే మంచు విష్ణు ఏడాది క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ' కు సీక్వెల్ గా ''డీ & డీ'' అనే సినిమా చేయనున్నట్లు టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కానీ హీరో ఆ సినిమాని పక్కన పెట్టి 'జిన్నా' చేస్తే.. డైరెక్టర్ ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇలా టాలీవుడ్ లో చాలా సినిమాలు అనివార్య కార‌ణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. అందులో కొన్ని అసలు భవిష్యత్ లో ఉంటాయో లేదో కూడా తెలియడం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.