Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బర్త్ డే కానుకల పట్ల అభిమానులు హ్యాపీయేనా..?

By:  Tupaki Desk   |   21 May 2021 10:10 AM GMT
ఎన్టీఆర్ బర్త్ డే కానుకల పట్ల అభిమానులు హ్యాపీయేనా..?
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే #NTR30 ప్రాజెక్ట్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ - యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిన్న గురువారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ఎన్టీఆర్‌ ఇన్‌ షర్ట్‌ చేసుకుని క్లాసీగా స్మార్ట్‌ లుక్‌ లో కనిపించారు. ఇది యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ NTR30 నుంచి ఓ సాలిడ్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. టైటిల్ - హీరోయిన్ - టెక్నిషియన్స్ కి సంబంధించిన వివరాలు ఇస్తారని భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో కాస్త నిరాశ చెందారు. అయినా చేసేదేమీ లేక వదిలిన పోస్టర్ ను చూసుకొని సంబర పడుతున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం నుంచి కొమురం భీమ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే దీని కంటే మంచి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చాలా ఉన్నాయంటూ ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందీ పోస్టర్. అయినా సరే ఏదొకటి వచ్చిందిలే అని అభిమానులు ఖుషీ అయ్యారు.

ఇదే క్రమంలో ఎన్నాళ్ళుగానో ఊరిస్తూ వస్తున్న '#NTR31' ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రావడంతో సంబరాలు మిన్నంటాయి. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. అలానే 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా కూడా ఎన్టీఆర్ తో సినిమాని కన్ఫర్మ్ చేశాడు. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఈ ప్రాజెక్ట్ పై హింట్ ఇచ్చాడు. ఇలా తారక్ పుట్టిన రోజును రెండు పోస్టర్స్ - రెండు ప్రాజెక్ట్స్ కన్ఫర్మేషన్ అనే విధంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.