Begin typing your search above and press return to search.

రెహమాన్‌ పాతికేళ్లలో తొలిసారి...

By:  Tupaki Desk   |   24 Jun 2015 11:30 AM GMT
రెహమాన్‌ పాతికేళ్లలో తొలిసారి...
X
రెహమాన్‌ మంచి మ్యూజిక్‌ డైరెక్టరే కాదు.. మంచి సింగర్‌ కూడా. అలాగని తన ప్రతి సినిమాలో గళం విప్పడు. అప్పుడప్పుడూ అరుదుగా మాత్రమే పాడుతుంటాడు. ముస్తఫా ముస్తఫా, న్యూయార్క్‌ నగరం లాంటి స్పెషల్‌ సాంగ్స్‌ పడ్డప్పుడు.. తను పాడితేనే ఆ పాటకు అందం వస్తుందనుకున్నపుడు మాత్రమే గొంతు సవరించుకుంటాడు రెహమాన్‌. ఐతే ఇప్పటిదాకా రెహమాన్‌ పాడిన పాటలన్నీ తన సినిమాల కోసమే. బయటి సినిమాలు, వేరే మ్యూజిక్‌ డైరెక్టర్ల కోసం ఎప్పుడూ పాట పాడలేదు రెహమాన్‌. ఐతే తన పాతికేళ్ల మ్యూజిక్‌ కెరీర్‌లో రెహమాన్‌ తొలిసారి వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌ ట్యూన్‌కు గొంతు ఇవ్వబోతున్నాడు.

ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మరెవ్వరో కాదు.. రెహమాన్‌ మేనల్లుడు జి.వి.ప్రకాష్‌ కుమార్‌. రెహమాన్‌ సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ 17 ఏళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన జి.వి.ప్రకాష్‌ కుమార్‌ చాలా వేగంగానే తమిళనాట టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో ఒకడిగా ఎదిగాడు. చూస్తుండగానే 50 సినిమాల మైలురాయిని కూడా అందుకున్నాడు. స్టార్‌ హీరో విజయ్‌తో 'రాజు రాణి' ఫేమ్‌ అత్లీ తీయబోయే సినిమాకు ప్రకాషే సంగీత దర్శకుడు. ఇదే అతడి 50వ సినిమా. ఇందులో తన మావయ్యతో ఓ పాట పాడించాలన్నది ప్రకాష్‌ కోరిక. రెహమాన్‌ కూడా కాదనలేకపోయాడు. గతంలో చాలామంది మ్యూజిక్‌ డైరెక్టర్లు రెహమాన్‌తో పాడించడానికి ప్రయత్నించినా ఒప్పుకోలేదు. కానీ మేనల్లుడు అడిగేసరికి ఒప్పుకోక తప్పలేదు.