Begin typing your search above and press return to search.

మోత మోగిస్తున్న హాలీవుడ్ సినిమా

By:  Tupaki Desk   |   16 Dec 2018 7:21 AM GMT
మోత మోగిస్తున్న హాలీవుడ్ సినిమా
X
'2.0’ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వీక్ అయిపోయింది. గత వారం వచ్చిన నాలుగు సినిమాల్లో ఒక్కటీ నిలవలేదు. అన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఈ వారం పేరుకు నాలుగు సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటిలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటున్నది ఒక్క సినిమానే. ఆశ్చర్యకరంగా లోకల్ సినిమాల్ని ఓ హాలీవుడ్ సినిమా వెనక్కి నెట్టడం విశేషం. ఆ చిత్రమే.. ఆక్వామన్. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్ లోనే కాక తెలుగులోనూ ‘సముద్ర పుత్రుడు’ పేరుతో విడుదల చేశారు.

ముందు నుంచి ఈ చిత్రానికి మాంచి హైప్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇంగ్లిష్ వెర్షన్ హౌస్‌ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో ‘ఆక్వామన్’ మోత మోగించేస్తోంది. ముఖ్యంగా త్రీడీ వెర్షన్‌ కు వీకెండ్లో టికెట్లు దొరకడం కష్టమవుతోంది. తెలుగు వెర్షన్ సైతం బాగానే ఆడుతోంది. తెలుగు సినిమాల్ని పక్కన పెట్టి మరీ ఈ సినిమాకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మన ప్రేక్షకులు.

ఇక ఈ వారం విడుదలైన సినిమాల్లో ‘భైరవ గీత’ అడ్రస్ లేకుండా పోయింది. ఆ చిత్రానికి పేలవమైన టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ లేవు. మోహన్ లాల్ నటించిన మలయాళ డబ్బింగ్ సినిమా ‘ఒడియన్’కూ బ్యాడ్ టాక్ వచ్చింది. ‘హుషారు’కు టాక్ పర్వాలేదు కానీ.. అందులో స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్లో ఏమో.. ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. మొత్తానికి ఈ వారం బాక్సాఫీస్ విజేత ‘ఆక్వామన్’ అలియాస్ ‘సముద్ర పుత్రుడు’ అనే చెప్పాలి.