Begin typing your search above and press return to search.

కుక్క‌ల మ‌నోభావాల్ని దెబ్బ తీసిన జ‌క్క‌న్న సారీ చెప్పాలి!

By:  Tupaki Desk   |   5 July 2021 6:00 AM IST
కుక్క‌ల మ‌నోభావాల్ని దెబ్బ తీసిన జ‌క్క‌న్న సారీ చెప్పాలి!
X
ఈరోజుల్లో ప్ర‌తిదీ ఒక న్యూసే కాదు న్యూసెన్స్ కూడా. ఎవ‌రైనా ఏదైనా విష‌యంపై అభిప్రాయాల్ని స్వేచ్ఛ‌గా చెప్పాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంది. అందులో య‌థాలాపంగానో యాథృచ్ఛికంగానో త‌ప్పు దొరికితే అదో పెద్ద డిబేట్ అయిపోతుంది. తాజాగా రాజ‌మౌళి ఓ సోష‌ల్ మీడియా ఒపీనియ‌న్ తో అలానే దొరికిపోయారు.

ఆయ‌న త‌న ప్ర‌యాణ మార్గంలో వీధి కుక్క‌ల స‌మూహాన్ని క‌నుగొన్నార‌ట‌. మ‌ధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దిల్లీ విమానాశ్ర‌యంలో ఆయ‌న దిగార‌ట‌. ఓవైపు కోవిడ్ టెస్టుల కోసం ఫామ్ లు నింపేందుకు జ‌నం గుంపుగా ఉన్నారు. మ‌రోవైపు గేటు వెలుప‌లి నుంచి వెళుతుంటే అక్క‌డ గుంపులుగా కుక్క‌లు ఉన్నాయని రాజ‌మౌళి వెల్ల‌డించారు. విదేశీయుల్లో మ‌న దేశానికి చెడ్డ పేరు తెస్తుంద‌న్న అభిప్రాయాన్ని సూటిగా బ‌య‌టికే చెప్పేశారు.

అయితే ఆయ‌న అభిప్రాయానికి వీధి కుక్క‌ల మ‌నోభావాలు దెబ్బ తిన్నాయి. దీంతో సామాజిక కార్య‌కర్త‌లు కొంద‌రు రంగంలోకి దిగి మీడియా ముందు రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య స‌రికాద‌ని ఉప‌న్యాసాలిస్తున్నారు. అంత పెద్ద సెల‌బ్రిటీ బాధ్య‌తారాహిత్యంగా వ్యాఖ్యానించార‌ని నెటిజ‌నులు ట్రోల్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రాజమౌళి దిల్లీ విమానాశ్రయం అధికారులకు చేసిన సూచ‌న ఇంత ముప్పు తెచ్చింది. మంచి కోసం వెళితే చెడు ఎదురైందా? లేక నిజంగానే రాజ‌మౌళి సూచ‌న‌ స‌రైన‌ది కాదా? అన్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళం నెల‌కొంది.

రాజ‌మౌళి ప్రత్యేక ప్రకటన జంతు హక్కుల కార్యకర్తలకు న‌చ్చ‌లేదు. వారు రాజమౌళిని నిందించారు. ఆయ‌న‌ బహిరంగ వేదికలపై ఇలాంటి అస్పష్టమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని జంతు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. జంతువులపై ఇటువంటి బాధ్యతా రహితమైన స్పృహలేని వ్యాఖ్యలను చేసినందుకు బాహుబలి దర్శకుడు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో నెటిజనులు కూడా రెచ్చిపోవ‌డం ఇక్క‌డ క‌నిపించింది. భార‌త‌దేశంలో మార్చాల్సిన‌వి చాలా ఉన్నాయ‌ని ఈ దేశాన్ని విదేశీయులకు ప్రెజెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని(జంతు మ‌నోభావాల్ని దెబ్బ తీయ‌కూడ‌ద‌ని) గుర్తు చేసుకునే సమయం ఆసన్నమైందని గుంటూరుకు చెందిన‌ జంతు హ‌క్కుల కార్య‌క‌ర్త‌ ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.