Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ ధరల పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అసలేమంది?

By:  Tupaki Desk   |   21 April 2022 1:29 AM GMT
సినిమా టికెట్ ధరల పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అసలేమంది?
X
సినిమా టికెట్ ధరల అంశంలో ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ తీరులో వ్యవహరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెన్ని చెప్పినా.. మరెన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గని జగన్.. అడక్కుండానే భారీగా ధరల్ని తగ్గించిన ఆయన.. అదే సమయంలో నివేదిక పేరుతో తనకు తోచిన రీతిలో టికెట్ ధరల్ని పెంచేశారన్న విమర్శ వినిపించింది. భారీగా తగ్గించటం ఎందుకు? మళ్లీ వాటి ధరల్ని పెంచుతూ నిర్ణయం దేనికి? ఈ మాత్రం దానికి ఇంత రచ్చ అవసరమా? అంటూ జగన్ సర్కారుపై మండిపాటు వ్యక్తమైంది. సింగిల్ థియేటర్ల విషయంలోనూ.. మల్టీఫ్లెక్సుల విషయంలోనూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ తరఫున ఫరీద్ బిన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందులో ప్రధానమైన రెండు అంశాల్ని చూస్తే.. మొదటిది సినిమా టికెట్ ధరల్ని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని.. లైసెన్సింగ్ అథార్టీ అయిన జేసీకి మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించింది. అంతిమంగా ధరల్ని డిసైడ్ చేసేది లైసెన్సింగ్ అథార్టీయేనని చెప్పిన హైకోర్టు.. ఈ వ్యవహారం మొత్తాన్ని లోతుగా చూడాల్సి ఉందని పేర్కొంది.

ఇక.. మరో కీలకాంశం ఏమంటే.. ఆన్ లైన్ లో అమ్మే సినిమా టికెట్ల ధరల్లో సర్వీసు ఛార్జీలను టికెట్ ధరల్లో కలిపే వీల్లేదని స్పష్టం చేసింది. పాత విధానంలో టికెట్లను అమ్మొచ్చని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలపై సందేహాలు..నిధుల దుర్వినియోగం.. మళ్లింపు వంటివి జరుగుతాయన్న ఆందోళన అక్కర్లేదని పేర్కొంది.

దీనికి సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ వ్యాప్తంగా ఉన్న మల్టీఫ్లెక్సు థియేటర్ల టికెట్ ధరల్లోనే సర్వీసు ఛార్జీలను చేరుస్తూ జగన్ సర్కారు ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై జరిగిన విచారణలో పేర్కొన్న కీలక అంశాల్లో ముఖ్యమైనది.. సర్వీసు ఛార్జీల వడ్డన. ఆన్ లైన్ టికెట్ల ధరల్లోనే సర్వీసు ఛార్జీల్ని కలపొద్దని స్పష్టం చేసింది.

విమాన..రైలు టికెట్లతో పాటు ఫుడ్ సర్వీసు యాప్ లకు సర్వీసు ఛార్జీల్ని అదనంగా చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు సినిమా టికెట్ ధరల్లో ఆన్ లైన్ సర్వీసు ఛార్జీలను చేర్చటం సరికాదని స్పష్టం చేసింది. తాజాగా విడుదల చేసిన మధ్యంతర మార్గదర్శకాలు మల్టీఫ్లెక్సులకు ఊరట కలిగించనున్నాయి.