Begin typing your search above and press return to search.

ఏపీ అప్పులు ఎక్కువ‌య్యాయిః కేంద్రం

By:  Tupaki Desk   |   27 July 2021 10:00 PM IST
ఏపీ అప్పులు ఎక్కువ‌య్యాయిః కేంద్రం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద స‌మ‌స్య‌ల్లో ఆర్థిక లోటు ఒక‌టి. న‌వ్యాంధ్ర లోటు బ‌డ్జెట్ తోనే ఏర్ప‌డింది. భ‌ర్తీ చేయాల్సిన కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు దాన్ని పూరించ‌లేదు. దీంతో.. రాష్ట్ర ప్ర‌భుత్వం అనివార్యంగా అప్పుల మీద‌నే ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి. ఫ‌లితంగా.. ఉద్యోగుల జీతాల‌కు కూడా క‌ట‌క‌ట ఎదుర‌వుతోంది. ప్ర‌తీ మంగ‌ళ‌వారం ఆర్బీఐ వ‌ద్ద బాండ్ల వేలం ద్వారా అప్పులు సేక‌రిస్తున్న ప‌రిస్థితి.

ఇక‌, అప్పులు పుట్టే ఇత‌ర మార్గాలు కూడా మూసుకుపోయాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్ప‌టికే ప‌రిమితికి మించిన అప్పులు తీసుకుందంటూ ఈ మ‌ధ్య‌నే కేంద్రం.. రుణ ప‌రిమితిని బాగా త‌గ్గించింది. బాండ్ల వేలం ద్వారా ప్ర‌తీ మంగ‌ళ‌వారం ఇచ్చే 2 వేల కోట్ల‌ను కూడా ఇక‌పై ఆపేయాల‌ని ఆర్బీఐకి సూచించింద‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ఈ నెల ఉద్యోగుల‌కు జీతాలు కూడా చాలా ఆల‌స్య‌మయ్యాయి.

అయితే.. ఏపీ ప‌రిమితికి మించి అప్పులు తీసుకుంద‌ని రుణ ప‌రిమితిని మ‌రింత‌గా కుదించిన కేంద్రం.. ఆ అప్పులు ఎంత అనే విష‌యాన్ని ఇవాళ పార్ల‌మెంటులో బ‌య‌ట‌పెట్టింది. టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు.

ఈ ఏడాదిలో ఇప్ప‌టికే 4 వేల కోట్లు పరిమితి కి మించి అప్పులు చేసింద‌ని తెలిపారు. ఇక, 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో 54,369.18 కోట్ల ఆర్థిక లోటు ఉన్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే బ‌డ్జెట్లో సూచించింద‌ని స్ప‌ష్టం చేశారు. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.30,305 కోట్లు, క‌రోనా కార‌ణంగా మ‌రో రూ.19,192 కోట్ల అప్పు తీసుకునేందుకు ఏపీకి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు తెలిపారు. మొత్తంగా 49,497 కోట్లు మాత్ర‌మే అప్పు పొందేందుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు చెప్పారు.