Begin typing your search above and press return to search.

'బాహుబలి' వసూళ్లపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు..?

By:  Tupaki Desk   |   29 Sep 2021 5:30 PM GMT
బాహుబలి వసూళ్లపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు..?
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్ లైన్ సినిమా టికెటింగ్ సిస్టమ్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో ఈ విధానం గురించి చర్చించిన టాలీవుడ్ పెద్దలు దానికి అంగీకారం తెలిపారు. ఆన్ లైన్ సినిమా టికెట్ బుకింగ్ సిస్టమ్ తీసుకురావాలని తామే కోరినట్లు సినీ ప్రముఖులు తెలిపారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ విధానాన్ని వ్యతిరేఖించారు. తాము సినిమాలు తీస్తే ఏపీ ప్రభుత్వం డబ్బులు దండుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు పవన్‌ కల్యాణ్‌ పెద్ద గుదిబండగా మారారని విమర్శించారు.

గతంలో ఎన్టీఆర్‌ నుంచి రాజబాబు వరకు ఎవరి సినిమాలైనా టికెట్‌ ధరలు ఒకేలా ఉండేవని.. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేవని.. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటూ ప్రేక్షకుల నుంచి దోచుకుంటున్నారని సజ్జల అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్ లైన్ టికెటింగ్ విధానం వల్ల ఎన్టీఆర్‌ సినిమా అయినా.. కాంతారావు సినిమా అయినా టికెట్‌ ధర ఒకేలా ఉంటుందని తెలిపారు. ప్రేక్షకుడికి తక్కువ ధరకు వినోదం లభిస్తుందంటే పవన్‌ కళ్యాణ్ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని.. సినిమా టికెట్లతో ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందనే విషయాన్ని కూడా పవన్‌ చెబితే బాగుంటుందని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా 'బాహుబలి' సినిమా కలెక్షన్స్ విషయంలో విడుదలైన తొలి వారంలో సగం డబ్బు ప్రభుత్వానికి.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసినట్టు సజ్జల రామకృష్ణ ఆరోపించారు. తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్టు తెలిసిందని.. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్నులు రాలేదో తేల్చాల్సి ఉందని సజ్జల అన్నారు. ఈ వ్యవహారంపై 'బాహుబలి' సహా పలు సినిమాల వసూళ్లపై దర్యాప్తు చేసి నిజం నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆన్‌ లైన్‌ విధానంలో అయితే ఎవరికెళ్లాల్సిన డబ్బులు వారికి వెంటనే వెళ్లిపోతాయని.. ఎవరు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు, ఎవరు కట్టడం లేదనేది కూడా తెలుస్తుందని సజ్జల అన్నారు.

ఇకపోతే ఆన్‌ లైన్‌ విధానం వల్ల నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. తన సినిమాకు ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుందని 'లవ్ స్టొరీ' నిర్మాత పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్మోహన్‌ రావు.. ఆన్‌ లైన్‌ లో టికెట్ల అమ్మకాలంటే ఫోన్‌ లో బుక్‌ చేసుకోవాలనేది కాదు.. థియేటర్‌ కౌంటర్ వద్ద కూడా ఆన్‌ లైన్‌ ద్వారా టికెట్స్ ఇస్తారు అని చెప్పారు. తెలంగాణలో సినిమా టికెట్ల అమ్మకాలపై వస్తున్న టాక్స్ కంటే ఆంధ్రప్రదేశ్‌ లో ఎక్కువ రావాలి. కానీ అలా జరగడం లేదని నిర్మాత తెలిపారు.

అక్కడ టికెట్లను కొందరు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయని.. ఇలా అమ్మడం వల్ల స్థానికంగా ఎవరో లాభపడతారు తప్పించి ప్రభుత్వానికి గానీ, నిర్మాతకు గానీ ప్రయోజనం ఉండదు అని రామ్మోహన్ రావు అన్నారు. టికెట్‌ అమ్మకాలు జరుగుతున్న స్థాయిలో పన్నులు రావడం లేదని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకే ఆన్‌ లైన్‌ వ్యవస్థ తీసుకొస్తుందని.. దాని వల్ల నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. సినిమాకు ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయి? ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు నిర్మాతకు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. అంతేకాదు ప్రభుత్వాలకు ప్రతి టికెట్‌ పైనా ట్యాక్స్ వస్తుంది కాబట్టి ఆదాయం కూడా పెరుగుతుందని వెల్లడించారు. మొత్తం మీద ఆన్ లైన్ సిస్టమ్ వల్ల యజమాని నుంచి డిస్ట్రిబ్యూటర్ నిర్మాతల వరకూ సినిమా పరిస్థితి ఎంటనేది అర్థమవుతుందనే విధంగా పుస్కూర్‌ రామ్మోహన్‌ చెప్పుకొచ్చారు.