Begin typing your search above and press return to search.

ఫోటోగ్రాఫర్ల‌పై అనుష్క‌ ఫైర్! ఎంత చెప్పినా అంతేనా!?

By:  Tupaki Desk   |   7 Jan 2021 1:20 PM IST
ఫోటోగ్రాఫర్ల‌పై అనుష్క‌ ఫైర్! ఎంత చెప్పినా అంతేనా!?
X
వ్య‌క్తిగ‌త జీవితం వేరు .. వృత్తిగ‌త జీవితం వేరు. ఒకటి ప్ర‌యివేట్ అయితే ఇంకోటి ప‌బ్లిక్. కానీ బాలీవుడ్ మీడియా వ్య‌క్తిగ‌త జొర‌బాటుకు చూపించే ఆత్రం ఎల్ల‌వేళ‌లా ఇర్రిటేట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది.

అప్ప‌ట్లో చిన్నారి ఆరాధ్య బ‌చ్చ‌న్ పై ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని తీరుగా స్నాప్ ల‌తో విరుచుకుప‌డిన స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల దుండుదుకును త‌ట్టుకోలేక బ‌చ్చ‌న్ జీ కోడ‌లు.. మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ ఏకంగా కంట నీరు పెట్టుకున్నారు. ప‌బ్లిక్ లోనే ఏడ్చేయ‌డం సంచ‌ల‌నం అయ్యింది. ఆ ఘ‌ట‌న‌తో మీడియా ఫోటోగ్రాఫ‌ర్లు ఇంత ఇదిగా ఉంటారా? అన్న చ‌ర్చా సాగింది. చాలా సంద‌ర్బాల్లో సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చేస్తూ ఇష్టానుసారం అనుమ‌తి లేకుండా ఫోటోలు తీసేయ‌డం వీడియోల్ని ఇంట‌ర్నెట్ లో ఎక్స్ క్లూజివ్ పేరుతో రిలీజ్ చేయ‌డం చూస్తున్న‌దే.

ఇక సెల‌బ్రిటీలు జిమ్ కి వెళుతున్నా.. ఆరుబ‌య‌ట షాపింగుకి వ‌చ్చినా..విమాన యానాల్లో ఉన్నా.. ఇంటి బాల్క‌నీలో ఉన్నా బాలీవుడ్ మీడియా అయితే అస్స‌లు విడిచిపెట్ట‌దు.

ప్రతిసారీ సెలబ్రిటీలు వారి ఇంటి నుండి బయటికి వస్తే చ‌కోర ప‌క్షుల్లా వేచి చూసే ఒక సెక్ష‌న్ ఫోటోగ్రాఫర్ ‌లు ఉంటారు. కానీ ఈ ధోరణికి సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే విసుగెత్తిపోయారన‌డానికి చాలా రాద్ధాంతాలు ఉదాహ‌ర‌ణ‌లుగా ఉన్నాయి. హిందీ చిత్ర‌సీమ‌ అగ్ర క‌థానాయిక అనుష్క శర్మ తాజాగా ఫోటోగ్రాఫ‌ర్ల‌పై విరుచుకుప‌డ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల త‌న‌ భర్త విరాట్ కోహ్లీ బాల్కనీలో టైమ్ స్పెండ్ చేస్తుంటే..ఆ చిత్రాన్ని సీక్రెట్ గా ఫోటో తీసి అంత‌ర్జాలంలోకి రివీల్ చేసేశారు. అది కోట్లాది మంది ఫ్యాన్స్ లోకి త్వరగా వైరల్ అయ్యింది. దానికి అనుష్క‌-కోహ్లీ జంట చిన్న బుచ్చుకుంది. అది ఏమాత్రం ఆమోద యోగ్యం కాద‌ని అనుష్క విరుచుకుప‌డింది. తమ‌ గోప్యతను గౌరవించాలని ఆమె ఫోటోగ్రాఫ‌ర్ల‌ను కోరింది. ఎంత చెప్పినా కుక్క తోక వంక‌ర‌లా మార‌డం లేద‌ని కూడా అనుష్క సీరియ‌స్ అయ్యారు.

విరుష్క‌ జంట ఈ సంవత్సరం తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. ఇంత‌కుముందు అనుష్క బేబి బంప్ ఫోటోలు ప‌లుమార్లు వైర‌ల్ అయ్యాయి. అవ‌న్నీ అధికారికంగా అనుష్క ఇష్ట‌పూర్వ‌కంగా ఫోటోల‌కు ఫోజులిచ్చిన‌వే. అలా కాకుండా త‌మ‌ వ్యక్తిగత జీవితాలను ఆక్రమిస్తేనే ఇబ్బంది. త్వ‌ర‌లోనే బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న విరుష్క జోడీ.. ఆ త‌ర్వాత స్నాప్ ల‌కు చిక్క‌కుండా ఎలా త‌ప్పించుకుంటారు? అన్న‌దే ఇప్పుడు వేడెక్కించే ట్విస్ట్.