Begin typing your search above and press return to search.

డిసెంబర్ లో '18 పేజెస్'.. ఆకట్టుకుంటున్న అందాల అనుపమ ఫస్ట్ లుక్..!

By:  Tupaki Desk   |   10 Sep 2021 11:23 AM GMT
డిసెంబర్ లో 18 పేజెస్.. ఆకట్టుకుంటున్న అందాల అనుపమ ఫస్ట్ లుక్..!
X
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''18 పేజెస్''. 'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఇందులో నిఖిల్ సరసన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో నేడు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అనుపమ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

''18 పేజెస్'' చిత్రంలో నందిని అనే యువతి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. అందమైన ప్రకృతిలో ఒదిగిపోయినట్లుగా నందిని ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ సందర్భంగా వదిలిన మోషన్ పోస్టర్ లో.. అడవిలో ఓ సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి అందాల అనుపమ చేతి మీద వాలినట్లు చూపించారు. కర్లీ హెయిర్ తో చిరునవ్వులు చిందిస్తున్న అనుపమ.. ఎంతో అందగా కనిపిస్తోంది. ఈ వీడియోకి గోపీ సుందర్ సమకూర్చిన నేపథ్య సంగీతం.. సినిమాటోగ్రాఫర్ వసంత్ కుమార్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఈ చిత్రంలో సిద్ధు అనే యువకుడి పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ చాప్టర్ లో నిఖిల్ కళ్ళకు ఓ కాగితంతో గంతలు కట్టి ఉండగా.. అనుపమ పరమేశ్వరన్ దానిపై పెన్నుతో రాస్తున్నట్లు చూపించారు. ''నా పేరు నందిని. నాకు మొబైల్ లో అక్షరాలను టైప్ చేయడం కన్నా ఇలా కాగితం పై రాయడం అంటే ఇష్టం. టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటుంది. కానీ రాసే ప్రతి అక్షరానికి ఓ ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది'' అనే లైన్ చూపించి ఇందులో నందిని పాత్ర ఎంతో ప్రత్యేకమని హింట్ ఇచ్చారు.

''18 పేజెస్'' అనే టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర బృందం.. సిద్ధు - నందిని ఫస్ట్ లుక్స్ తో అంచనాలు రెట్టింపు చేసారు. సుకుమార్ వైవిధ్యమైన కథాంశంలో నిఖిల్ - అనుపమ లను భాగం చేసినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 2021 డిసెంబర్ లో '18 పేజెస్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.