Begin typing your search above and press return to search.

అనుపమకు చుక్కలు చూపించిన ట్రోలర్లు

By:  Tupaki Desk   |   10 April 2019 8:35 AM GMT
అనుపమకు చుక్కలు చూపించిన ట్రోలర్లు
X
ఈ సోషల్ మీడియా జెనరేషన్లో ట్రోలింగ్ బారిన పడని సెలబ్రిటీలను వేళ్ళమీద లెక్కెట్టొచ్చు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటివారికి కూడా ఈ బెడద తప్పడం లేదు. ఇక సాధారణ హీరోయిన్ల సంగతి సరే సరి. రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఉత్తి పుణ్యానికి సోషల్ మీడియాలో చీల్చిచెండాడారు నెటిజనులు. ఈమధ్య అనుపమ తన కొత్త తెలుగు సినిమా 'రాక్షసుడు' ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. అంతే.. ఇక్కడ రాయలేని భాషలో బూతులు తిట్టారు.

అసలు అలా ఎందుకు జరిగిందో మొదట ఎవరికీ అంతు చిక్కలేదు. కానీ ట్రోలర్ల మెసేజిలను పూర్తిగా చదివిన తర్వాత మాత్రం తత్త్వం బోధపడింది. విషయం ఏంటంటే కేరళలో త్రిస్సూర్ కలెక్టర్ గా పనిచేసే టీవీ అనుపమ రీసెంట్ గా ఒక బీజేపీ అభ్యర్థిపై 'శబరిమల' కు సంబంధించిన ఎలెక్షన్ కమిషన్ రూల్స్ ను అతిక్రమిస్తున్నాడని కంప్లయింట్ చేసింది. దీంతో చాలామంది ఆమెను టార్గెట్ చేశారు. కొంతమంది అనుపమ పరమేశ్వరన్ ను కలెక్టర్ అనుపమగా పొరపాటుపడి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఈ విషయంపై ఇంకా అనుపమ స్పందించలేదు.

ట్రోలర్లకు నచ్చని డ్రెస్ వేసుకున్నా.. ఏదైనా లూజ్ కామెంట్ చేసినా.. ఎవరివైనా మనోభావాలను గాయపరిచినా వారిని నెటిజనులు ట్రోల్ చేయడం చాలా కామన్. కానీ చేయని పనికి ఇలా ట్రోలింగ్ కు గురికావడం బాధాకరమే. ఇదంతా చూస్తుంటే ఆ ట్రోలర్ల బ్రెయిన్లు మోకాళ్ళలో ఉన్నాయనే విషయం అర్థం అవుతోంది. ఎవరిని ట్రోల్ చేస్తున్నాం.. ఎందుకు ట్రోల్ చేస్తున్నామనే కనీస అవగాహన కూడా లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ట్రోల్ చేస్తున్నారంటే.. అదంతా జఫ్ఫా బ్యాచ్ లాగా ఉందే!