Begin typing your search above and press return to search.

అనూప్.. మరీ ఇంత దారుణమా?

By:  Tupaki Desk   |   26 Dec 2015 1:30 PM GMT
అనూప్.. మరీ ఇంత దారుణమా?
X
తెలుగులో సినిమాల్ని పోలిన సినిమాలు చాలానే వస్తుంటాయి. ఒక ఫార్ములా హిట్టవగానే దాన్ని పట్టుకుని వరుసబెట్టి సినిమాలు తీసేస్తుంటారు. కథలు కాపీ కొట్టేస్తుంటారు. సన్నివేశాలు కాపీ కొట్టేస్తుంటారు. తాజాగా తెలుగులో విడుదలైన ‘సౌఖ్యం’ సినిమానే తీసుకోండి. అందులో కొత్తగా అనిపించే సన్నివేశం ఒక్కటీ ఉండదు. గత ఏడాది సూపర్ హిట్టయిన ‘లౌక్యం’ సినిమా ఫార్మాట్లోనే సాగుతుందీ సినిమా. ‘లౌక్యం’ను పోలిన ‘సౌఖ్యం’ అని టైటిల్ పెట్టడమే కాదు.. టైటిల్ లోగో డిజైనింగ్ కూడా ఒకేలా ఉంటుంది. సినిమాలో చాలా అంశాల్లో ‘లౌక్యం’ పోలిక, అనుకరణ కనిపిస్తుంది.

అన్నింటికంటే చిత్రమైన విషయం ఏంటంటే.. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సైతం మిగతా వాళ్ల బాటలోనే నడవడం. ‘లౌక్యం’ సినిమాలోని ‘నిన్ను చూడగానే..’ పాట హమ్మింగ్ ను ‘సౌఖ్యం’ బ్యాగ్రౌండ్ స్కోర్ లో వాడేసుకుని ఆశ్చర్యపరిచాడు అనూప్. ఇది ఒకటి రెండు సన్నివేశాల్లో కూడా కాదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే చాలా సన్నివేశాల్లో.. ‘నిన్ను చూడగానే..’ పాట హమ్మింగ్ బ్యాగ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడి పాటల్నో కాపీ కొట్టడం.. లేదా పాటల ట్యూన్లనే తిరిగి వినిపించడం చూస్తాం కానీ.. ఇలా బ్యాగ్రౌండ్ స్కోర్ ను కూడా మళ్లీ ఇలా వాడుకోవడం చాలా దారుణమైన విషయం. ‘సౌఖ్యం’ టీమ్ ఎంత మొక్కుబడిగా పని కానిచ్చేసిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.