Begin typing your search above and press return to search.

పవన్.. బన్నీ.. ఇప్పుడు చైతూ

By:  Tupaki Desk   |   25 Nov 2017 7:21 AM GMT
పవన్.. బన్నీ.. ఇప్పుడు చైతూ
X
రెండేళ్ల కిందట ‘యాక్షన్ హీరో బిజు’ అనే సినిమాతో మలయాళంలో కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయెల్‌. ఐతే అందులో నివిన్ పౌలీ లాంటి పెద్ద హీరోతో నటించినప్పటికీ ఆమెకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు ఆమె తాను పుట్టి పెరిగిన ఫారిన్ కంట్రీకే వెళ్లిపోయింది. కానీ తెలుగులో ‘మజ్ను’లో అవకాశం రావడంతో తిరిగొచ్చి ఈ సినిమాలో నటించాక ఆమె దశ తిరిగింది. ఈ సినిమా అనుకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆపై ‘ఆక్సిజన్’.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి సినిమాల్లో నటించిన అనుకు ఆశ్చర్యకరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.

ఆ సినిమాల్లో నటిస్తుండగానే అనుకు మరిన్ని అవకాశాలు అందుతున్నాయి. తాజాగా అక్కినేని నాగచైతన్య సరసన నటించే అవకాశం కూడా పట్టేసిందట అను. చైతూ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే సినిమా మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనునే హీరోయిన్ అట. ‘అజ్నాతవాసి’ తీస్తున్నపుడు అను టాలెంట్ చూసి ఆ చిత్ర నిర్మాత రాధాకృష్ణ.. తనకే చెందిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో తెరకెక్కబోయే ‘శైలజారెడ్డి అల్లుడు’లో ఆమెకు ఛాన్స్ ఇప్పించాడట. ఈ చిత్రంలో కీలకమైన హీరో అత్త పాత్రకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముందు రమ్యకృష్ణ పేరు వినిపించగా.. ఆ తర్వాత శ్రీదేవి పేరు కూడా తెరమీదికి వచ్చింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.