Begin typing your search above and press return to search.

రవితేజ సినిమా నుంచి ఆమె ఔట్

By:  Tupaki Desk   |   20 May 2018 3:09 PM IST
రవితేజ సినిమా నుంచి ఆమె ఔట్
X
పాపం అను ఇమ్మాన్యుయెల్. టాలీవుడ్లో ఈ మలయాళ కుట్టి ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా కింద పడుతోంది. ‘మజ్ను’.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’.. ‘ఆక్సిజన్’ లాంటి చిన్న-మీడియం రేంజి సినిమాలతో కెరీర్ ఆరంభించిన ఈ అమ్మాయి.. అనూహ్యంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల సరసన నటించే అవకాశం అందుకుంది. కానీ వాళ్లతో నటించిన ‘అజ్ఞాతవాసి’.. ‘నా పేరు సూర్య’ ఆమెకు షాకిచ్చాయి. దీంతో ఆమె కెరీర్ కు పెద్ద బ్రేక్ పడేలాగే కనిపిస్తోంది. ఇక తెలుగులో ఆమెకు మిగిలింది రెండు సినిమాలు. ఆ రెంటిలో ఒకదాన్నుంచి అను బయటికి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. మాస్ రాజా రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.

ఈ సినిమాకు డేట్ల సమస్య వల్ల బయటికి వచ్చేస్తున్నట్లు అను ఇమ్మాన్యుయెల్ వెల్లడించింది. నాగచైతన్య సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’లోనూ అను కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తమిళంలో కూడా ఒక సినిమా చేస్తోందామె. ఐతే అమెరికాలో 50 రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’టీం అనును బల్క్ డేట్లు అడగ్గా ఇవ్వలేని పరిస్థితి నెలకొందట. దీంతో ఆమెను కాదని మరో కథానాయిక కోసం చూస్తున్నారు. శ్రుతి హాసన్.. ఇలియానా లాంటి సీనియర్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అసలే ఫ్లాపుల్లో ఉన్న టైంలో ఒక పెద్ద సినిమా చేజారడం అనుకు మైనస్సే. ఇక ఆమె ఆశలన్నీ ‘శైలజా రెడ్డి అల్లుడు’ మీదే నిలవనున్నాయి. ఆ సినిమా ఫలితం తేడా వస్తే మాత్రం అను కెరీర్ కు శుభం కార్డు పడిపోవడం ఖాయం.